తిరుగులేని వేట పక్షులవి. ఎరని వేటాడటంలోని వాటి వ్యూహం, వేగం


 తిరుగులేని వేట పక్షులవి. ఎరని వేటాడటంలోని వాటి వ్యూహం, వేగం ఎవర్నైనా అబ్బురపరుస్తాయి. ఆ అబ్బురపాటే... వాటిని ఇప్పుడు భారత సైన్యంలోనూ భాగం చేసింది. శత్రుదేశాల డ్రోన్‌లని నేలకూల్చే బాధ్యతని అప్పగించింది. ఆ మధ్య గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా ‘కర్తవ్య పథ్‌’లో కనిపించి... అశేషజనాన్ని ముక్కున వేలేయించిన ఈ ‘సైనిక పక్షుల’ సంగతేమిటో చూద్దామా...! 

చొరబాట్లు... మనదేశానికి కొత్తకాదు. సుమారు పది వేల కిలోమీటర్ల మేర మన సైనికులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ సరిహద్దుల్ని కాపలాకాస్తున్నా సరే... ఇవి ఆగట్లేదు. ఇటీవలి కాలంలో శత్రువుల చేతికి డ్రోన్‌లూ వచ్చాయి. వాటిని ఉపయోగించి మాదకద్రవ్యాలనీ, నకిలీ కరెన్సీలనీ, అక్రమ ఆయుధాలనీ యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇవీ మరీ చిన్నగా ఉండటం వల్ల మన రాడార్ల కళ్లుగప్పి మరీ రాగలుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక పరికరాలని మనదేశం తయారుచేసుకుంటూనే ఉందికానీ... వాటితోపాటే ఈ ‘విచిత్ర’ వీరుల్నీ సన్నద్ధం చేసుకుంది. 

అవే... గద్దలు. ఇందుకోసమే సుమారు 15 నల్ల గద్దలు, గరుడ పక్షులు, ఫాల్కన్‌లకి ఆరేళ్లపాటు శిక్షణ ఇచ్చి... మెరికలుగా తీర్చిదిద్దింది. ఆ మధ్య ఉత్తరాఖండ్‌లోని ఔలిలో జరిగిన భారత్‌-అమెరికా సంయుక్త విన్యాసాల్లో ఈ సుశిక్షిత పక్షుల్ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. శత్రు డ్రోన్‌లు కనిపించగానే రివ్వున ఎగురుతూ వెళ్లి వాటిని కూల్చివేసిన ఆ పక్షుల తెగువా, వేగం చూపరుల్ని విస్మయానికి లోనుచేశాయి! వాటిల్లోనూ కరణ్, అర్జున్‌ అనే రెండు నల్లగద్దలు ఇప్పటికే వందలాది డ్రోన్‌లని కూల్చి సత్తా చాటాయట. అంతేకాదు, తలపైన బుల్లి కెమెరాని ధరించి ఇవి దేశసరిహద్దుల్లో కాపలా కూడా కాస్తున్నాయి... మనకు వేగులుగానూ ఉపయోగపడుతున్నాయి. అందుకే... ఈ ఏడాది గణతంత్ర ఉత్సవాల సైనిక కవాతులో పాల్గొనే గౌరవాన్ని పొందాయి. 


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow