మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు పోలీస్ శాఖ, ఇటు రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..
శ్రీశైల మల్లికార్జున స్వామికి నిర్వహించే అత్యంత పవిత్రమైన 'పాగాలంకరణ' ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు.
ఆలయ పరిసరాలను సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షించాలని డీఐజీ ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు, వైద్య సహాయం అందేలా చూడాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. వాహనాల పార్కింగ్ విషయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనపు సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సులు సిద్ధం..
కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజు బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రసిద్ధ క్షేత్రాలైన పెదకళ్లేపల్లికి 15 బస్సులు, ఐలూరుకు 10 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చారు.
భక్తులపై అదనపు భారం పడకుండా, స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. బస్సుల ఫిట్‌నెస్‌ను స్వయంగా పరిశీలించిన డిపో మేనేజర్.. ప్రయాణికుల భద్రత విషయంలో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. గ్యారేజీలో ఉన్న బస్సుల కండిషన్‌ను తనిఖీ చేశారు.