ఇంటర్నెట్ డెస్క్: ప్రతినెలా క్యాలెండర్ మారడంతో పాటు ఆర్థికపరంగా కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. అలా మార్చి ఒకటి నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. సిమ్ బైండింగ్, యూపీఐకి సంబంధించిన రూల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
వాట్సప్ బంద్: వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్‌నకు సిమ్ కార్డు బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మార్చి 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఫోన్‌లో సిమ్‌కార్డు లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. ఆయా యాప్‌లను వెబ్‌బ్రౌజర్‌లో ఉపయోగిస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది. సైబర్ మోసాలను అరికట్టే ఉద్దేశంతో ఈ రూల్స్ తీసుకొచ్చింది.
యూటీఎస్ సేవలు నిలిపివేత: జనరల్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్ల బుకింగ్ కోసం రైల్వే శాఖ గతంలో తీసుకొచ్చిన యూటీఎస్ యాప్ మార్చి 1 నుంచి నిలిచిపోనుంది. ఈ సేవలన్నీ రైల్వేశాఖ కొత్తగా తీసుకొచ్చిన రైల్‌వన్ యాప్‌లో లభ్యమవుతాయి. యూటీఎస్ ఆర్-వాలెట్‌లోని నగదు ఉంటే రైల్‌వన్ యాప్‌నకు బదిలీ అవుతుంది.
యూపీఐకి బయోమెట్రిక్: యూపీఐ చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు పిన్‌తో పాటు బ్యాంకులు అదనంగా బయోమెట్రిక్ లేదా ఇతర ఆథరైజేషన్‌ను అడగనున్నాయి. దీంతో మోసాలను అరికట్టొచ్చు.
1600 సిరీస్: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు చేసే ఫోన్‌కాల్స్ ‘1600 సిరీస్’ నంబరును వినియోగించాలని ట్రాయ్ స్పష్టంచేసింది. బ్యాంకులు ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాయి. మార్చి 1 నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు, మార్చి 15 నుంచి స్టాక్‌బ్రోకర్ల నుంచి వచ్చే కాల్స్ కూడా ఈ సిరీస్ నుంచే రానున్నాయి. బ్యాంకుల పేరిట సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను అరికట్టేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.