ఉప్పునుంతల : సర్కారు బడుల్లో విద్యా బోధించే కొందరు ఉపాధ్యాయులు వివిధ వ్యాపార రంగాల మోజులో పడి ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య కరువై ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించడంతో ఇప్పటికే గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొన్ని గ్రామాల్లో స్కూళ్లను ఎత్తేసే పరిస్థితి దాపురించింది. అయినా ప్రభుత్వాలు కొత్త ఉరవడితో రకరకాల ఆలోచనలతో ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పడాలని తాపత్రయ పడుతుంటే లక్షలకు లక్షలు జీతాలు అనుభవిస్తూ ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పకుండా వచ్చామా.. పోయామా.. అన్నట్లుగా వ్యవహరించడం పరపాటిగా మారింది. ఉపాధ్యాయులకు స్థానిక పాఠశాలలో సమయపాలన ప్రకారం ఫేస్ అతేంటిక్ అటెండెన్స్ ఏర్పాటు చేసినా కూడా బురిడీ కొట్టిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం వరకే పాఠశాలల తలుపులకు తాళాలు వేసి వెళ్తున్నారని గ్రామస్థుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయి చెడు గ్రామ ప్రభుత్వ పాఠశాలనే ఇందుకు నిదర్శనం. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకే పాఠశాల విద్యార్థులను ఇంటికి పంపించి తలుపులకు తాళాలు వేసి ఉపాధ్యాయులు హెచ్ఎం లక్ష్మణ్ తోపాటు మరో ఉపాధ్యాయుడు వెళ్లిపోయారని గ్రామస్తులు ఆరోపించారు. దాదాపుగా ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుందని పట్టించుకునే వారు లేకపోవడం వలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే మర్రిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం ఉందని ఒక ఉపాధ్యాయుడు మీటింగ్ కు వెళ్లగా మరో ఉపాధ్యాయురాలు ఎమర్జెన్సీ పని ఉందని 5 తరగతులకు చెందిన 20 మంది విద్యార్థులను పాఠశాలలోనీ ఒకే తరగతి గదిలో వదిలేసి వెళ్ళటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు బడికి వచ్చిన పిల్లలకు విద్యాబోధనపై శ్రద్ధ లేకుండా సెల్ఫోన్లో కాలయాపన చేస్తున్నారని ఆయా గ్రామాల యువకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి శ్రద్ధ లేనిఉపాధ్యాయుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సమయపాలన లేకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, తల్లిదండ్రులు, యువకులు డిమాండ్ చేస్తున్నారు.
Tags
mahabubangar