తెలంగాణ సీఐడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కేసుల్లో బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలీసింగ్‌కు సీఐడీ శ్రీకారం చుట్టింది..
తెలంగాణ సీఐడీ (Telangana CID ) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కేసుల్లో బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలీసింగ్‌కు సీఐడీ శ్రీకారం చుట్టింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మహిళలు, చిన్నారుల కేసుల్లో తక్షణ చర్యలు ఉంటాయి. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాల్లో తీవ్ర మానసిక ఒత్తిడి ఉన్న కేసులు, పోక్సో చట్టం కింద కేసులు, ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి కేసుల్లో ఫోన్ చేస్తే చాలు పోలీసులు ఇంటికే వస్తారు. బాధితుల నివాసం, ఘటనా స్థలం, ఆసుపత్రి వంటి వివిధ ప్రాంతాల్లో పోలీసులు అక్కడికక్కడే ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈ కొత్త విధానంలో ఇంటి వద్దే బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే సంబంధిత స్టేషన్‌కు పంపి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్‌ఐఆర్ ప్రతిని ఇంటి వద్దే బాధితులకు అందిస్తారు. BNSS ప్రకారం స్టేట్‌మెంట్ రికార్డింగ్, సాక్ష్యాల సేకరణ వంటి ప్రక్రియలు అక్కడికక్కడే చేయనున్నారు. పౌర కేంద్రిత పోలిసింగ్ (citizen centric policing ) విధానాన్ని అన్ని పోలీస్ యూనిట్లు తప్పనిసరిగా అమలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు విడుదలయ్యాయి.