మాజీ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రూపు రేఖలు మార్చేశారని అన్నారు. ఆదివారం ఆమె జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల పాదాలు కడుగుతా అన్నారు.. పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేకపోయారని డీకే అరుణ అన్నారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ వంటి ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టులపై దృష్టి సారించలేదన్నారు. కేవలం డైలాగులతోనే పాలమూరు జిల్లా ప్రజలను తృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జూరాల అప్రోచ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసి.. నార్లాపూర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర అప్రోచ్‌ను మార్చారని వెల్లడించారు. నాడే తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిపారు. దీని వల్ల ప్రాజెక్టు పూర్తి కాదు.. కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆ నాడే మాట్లాడినట్లు తెలిపారు. డిండి ప్రాజెక్టుకు నీళ్లు తరలించే ప్రతిపాదన సరికాదని, మళ్లీ పొరపాటు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
*బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రసంగం ముఖ్యాంశాలు..*
మున్సిపాలిటీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎంపీ డీకే అరుణ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.
డ్రాఫ్ట్ ఓటరు జాబితాలోని పొరపాట్లను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు తెలిపారు.
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పార్టీ నేతలందరూ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీం వర్క్ చేయాలని, పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే వ్యూహ రచనలు చేయాలని దిశ నిర్దేశం చేశారు.
వార్డుల వారిగా నేతలు బాధ్యత తీసుకొని పనిచేయాలి.
పార్టీ ముఖ్య నేతలు మున్సిపాలిటీల వారిగా సమావేశాలు నిర్వహించాలని ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని, ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలని సూచించారు.
పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు సమావేశాలు నిర్వహించి.. అభ్యర్థుల ఎంపిక పై సమష్టి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
గెలుపు అవకాశాలు, సమీకరణలు దృష్టిలో పెట్టుకుని పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలిపిన, పార్టీ గెలుపుకోసం పనిచేయాలని అన్నారు.
మైనారిటీలను పార్టీలోకి ఆహ్వానించాలని, కేంద్ర ప్రభుత్వం తారతమ్య భావం లేకుండా సంక్షేమ,అభివృద్ది పథకాలు అందిస్తుందని అన్నారు.
ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆసక్తి ఉన్న మైనారిటీలను ప్రోత్సహించండి..
మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ ఉంటుంది కాబట్టి మరింత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకోవాలన్నారు.
బంధు ప్రీతి,ఇతర కారణాలతో పార్టీకి నష్టం చేస్తే.. బీజేపీ కార్యకర్త అనే హక్కు కోల్పోతారని హితవు పలికారు.
యువత,విద్యావంతులు బీజేపీ వైపు చూస్తున్నారని.. పార్టీ కోసం మరింత బలంగా పని చేస్తే గెలుపు తథ్యం అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల గురించి వివరించాలని సూచించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి అంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీజేపీ సీనియర్ నేతలు పద్మజారెడ్డి, పాండు రంగారెడ్డి, వీరబ్రంహాచారి,సుదర్శన్ రెడ్డి,నర్సింహులు సాగర్,కృష్ణవర్ధన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి,ఆంజనేయులు, సుబ్రమణ్యం, రాజేశ్వర్,కిరణ్ కుమార్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ తదితరులు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.