Nuvvu Naaku Nachav: ‘నువ్వు నాకు నచ్చావ్‌’.. మూడు గంటలు ఎవరు చూస్తారు అన్నారంతా..!


 

  • దేవుడా.. ఓ మంచి దేవుడా..
  • మీసాలు తిప్పని, తొడలు కొట్టని నవ్వులు పంచే వెంకటేశ్‌ని ఇచ్చావు..
  • అమ్మ కవితతో నవ్వించే ప్రకాశ్‌రాజ్‌ని ఇచ్చావు..
  • అమ్మాయిలు సైతం కుళ్లుకునేలా అందమైన ఆర్తి అగర్వాల్‌ను పరిచయం చేశావు..
  • గంటకోసారి పాట పాడాలంటూ పార్క్‌లో ఇబ్బంది పడే బ్రహ్మానందంతో నవ్వించావు..
  • ‘ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి. ప్రేమించడానికి కారణాలు చెప్పలేం’ అంటూ మనసుకు హత్తుకునే సంభాషణలు రాసిన త్రివిక్రమ్‌ను ఇచ్చావు..
  • అందమైన కథను అంతే అందంగా తీర్చిదిద్దిన విజయ్‌ భాస్కర్‌, స్రవంతి రవికిషోర్‌లను ఇచ్చావు..
  • అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా ఒక మంచి సినిమా ఇచ్చావు.. అందుకే ‘నువ్వు నాకు నచ్చావు’

ప్రేక్షకుల మదిలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నిసార్లు చూసినా అస్సలు విసుగు అనిపించవు సరికదా.. చూసిన ప్రతిసారీ ఓ సరికొత్త అనుభూతిని పంచుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో ‘నువ్వు నాకు నచ్చావ్‌!’ (Nuvvu Naaku Nachav) ఒకటి. ఛానళ్లు మారుస్తూ ఈ సినిమా కనపడగానే ఆగిపోయి, అయిపోయేవరకు టీవీ ముందు కూర్చొని కదలని వారెందరో! జనవరి 1వ తేదీన ఈ చిత్రం అత్యాధునిక హంగులతో రీ-రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ‘నువ్వు నాకు నచ్చావ్‌’ తెర వెనక విశేషాలు.. మీకోసం

తరుణ్‌తో అనుకున్నారు.. కానీ,

‘నువ్వే కావాలి’ అందించిన విజయంతో కె. విజయ్‌ భాస్కర్‌ (K Vijaya Bhaskar), త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) కాంబోలో మరో సినిమా ప్లాన్‌ చేశారు నిర్మాత స్రవంతి రవికిషోర్‌. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కథ చెప్పమని అడిగితే, వారు ‘నువ్వు నాకు నచ్చావ్‌’ వినిపించారు. ఇది కూడా తరుణ్‌తోనే తీస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. కానీ, మంచి కామెడీ టైమింగ్‌, ఎమోషనల్‌ సబ్జెక్ట్‌ కావటంతో మరో హీరోతో ప్రయత్నిద్దామనుకున్నారు. అదే సమయంలో నిర్మాత సురేశ్‌బాబు స్రవంతి రవికిషోర్‌కు ఫోన్‌ చేసి వెంకటేశ్‌ డేట్స్‌ ఉన్నాయని చెప్పారు. దీంతో దర్శకుడు విజయ్‌ భాస్కర్‌, రచయిత త్రివిక్రమ్‌లు వెంకటేశ్‌ (Venkatesh)ను కలిసి కథ వినిపించారు. ఆయనకు కూడా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.

ఆర్తికే అవకాశం

కథానాయికగా ముందుగా త్రిష, గజాలా పేర్లు వినిపించాయి. కానీ, ఓ హిందీ సినిమా చేసిన ఆర్తి అగర్వాల్‌ (Aarthi Agarwal)ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కథానాయిక తండ్రి పాత్ర కోసం నాజర్‌ అయితే బాగుంటుందని దర్శకుడు విజయ్‌భాస్కర్‌ సూచించారు. కానీ, స్రవంతి రవికిషోర్‌ మాత్రం ప్రకాశ్‌రాజ్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తెలుగు చిత్రాల్లో నటించేందుకు ప్రకాశ్‌రాజ్‌పై నిషేధం ఉండటంతో ఆయనకు సంబంధించిన సీన్స్‌ లేకుండా మిగిలిన పార్ట్‌ను పూర్తి చేశారు. తనపై నిషేధం తొలగిన మరుక్షణమే ప్రకాశ్‌రాజ్‌ చిత్రీకరణలో పాల్గొన్నారు. ముందుగా రాసుకున్న కథ ప్రకారం.. వాటర్‌ వరల్డ్‌లో బ్రహ్మానందం పాత్ర లేదు. వెంకటేశ్‌ సూచనల మేరకు నవ్వుల వర్షం కురిపించే ఈ సీన్స్‌ను యాడ్‌ చేశారు. ఆ సన్నివేశాలకు మిస్టర్‌ బీన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు.

ఇదో నిదర్శనం..

ఈ సినిమాలో నటీనటులు ఎంత బాగా చేశారో.. అంతకుమించి సాంకేతిక బృందం కష్టపడింది. దర్శకుడు కె.విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచన సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. కోటి అందించిన సంగీతం, పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌. కె.రవీంద్రబాబు ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చూపించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసి, ‘మూడు గంటలా.. సుహాసిని సీన్స్‌ కట్ చేసేయండి.. రెండున్నర గంటలకు తగ్గించండి’ అని గోల పెట్టారు. కానీ, స్రవంతి రవికిషోర్‌ కథపై నమ్మకంతో ఒక్క సీన్‌ కూడా తీయలేదు. సినిమా బాగుంటే మూడు గంటలు ఉన్నా ప్రేక్షకులు హాయిగా చూస్తారనడానికి ‘నువ్వు నాకు నచ్చావ్’ ఓ నిదర్శనం.

సెప్టెంబరు 6, 2001లో విడుదలైన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. వెంకటేశ్‌ కామెడీ టైమింగ్‌, ఆర్తి అగర్వాల్‌ అందం, బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్‌, ఎం.ఎస్‌.నారాయణ, సునీల్‌ల సన్నివేశాలు విపరీతంగా నవ్వులు పంచాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కట్టారు. ఒక్కొక్కరూ రెండు, మూడుసార్లు సినిమా చూశారంటే అతిశయోక్తి కాదు. 93 కేంద్రాల్లో 50 రోజులు, 57 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శితమై, ఆ సమయానికి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. త్రివిక్రమ్‌ కామెడీ పంచ్‌లకు జనాలు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ప్రకాశ్‌రాజ్‌ కుటుంబం అంతా భోజనానికి కూర్చొన్న సమయంలో దేవుడిపై వెంకటేశ్‌ చేసే ప్రార్థన.. ఆ తర్వాత అమ్మపై ప్రకాశ్‌రాజ్‌ చదివే కవితను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

  • ‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఇంట్రస్టింగ్‌ పాయింట్స్‌..
  • ఈ సినిమాను 85 రోజుల్లో పూర్తి చేశారు. నిడివి మూడు గంటల 14 నిమిషాలు.
  •  వెంకటేశ్‌ పారితోషికం మినహాయిస్తే, ఈ మూవీ బడ్జెట్‌ రూ.నాలుగున్నర కోట్లు
  • ఆర్తి అగర్వాల్‌ పారితోషికం రూ.10 లక్షలు
  • తమిళంలో ఈ మూవీని విజయ్‌తో రీమేక్‌ చేశారు. అక్కడ యావరేజ్‌. కన్నడలో మాత్రం హిట్‌.
  • న్యూజిలాండ్‌లో రెండు పాటలు తీశారు. అప్పుడు వెంకటేశ్‌కు విపరీతమైన జ్వరం.
  • ‘ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని’ పాటకు సీతారామశాస్త్రి 60 పల్లవులు రాశారు. కానీ, మొదటి రాసిందే ఓకే అయింది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow