ఎంపిక చేసిన వారికి మద్యం బాటిళ్లు
కుల, గ్రామ పెద్దలకు ప్రత్యేక ప్యాకేజీలు
మహిళా సంఘాల బాధ్యులకు తాయిలాలు
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.
డో విడత పంచాయతీ పోలింగ్ బుధవారం జరగనుండటంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు, దామెర, శాయంపేట, నడికూడ మండలాల్లో జోరుగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు పంచారు. కొన్నిచోట్ల రూ.3వేలు కూడా ఇచ్చారు. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల అధ్యక్షులను, సభ్యులను మచ్చిక చేసుకునేందుకు వారికి తాయిలాలను ఎరచూపారు. గ్రామ, కుల పెద్దలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వారికి డబ్బులతో పాటు మద్యం పంపిణీ చేశారు. గ్రామాల్లోని యువ ఓటర్లను కూడా డబ్బు, వస్తు రూపేనా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ నాలుగు మండలాల్లో డబ్బులు, మందు, విందులు, కానుకలు అందించి వారిని మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడ్డారు. తండాలలో ఓటుకు రూ. మూడు వందలు, మేజర్ పంచాయతీలలో రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పంచారు. దాంతో పాటు అదనంగా కొన్ని చోట్ల మద్యం బాటిళ్లను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మటన్, చీరలు, మిక్సీలు సైతం పంపిణీ చేశారు. రాత్రికి రాత్రే కుల పెద్దలను, మహిళా సంఘాలను, పరుపతి సంఘాల సభ్యులను, రాజకీయ నాయకులను కలిసి తమకు మద్దతు తెలపాలని కోరారు. ఇందుకు సంబంధించి వారికి ప్రత్యేక ప్యాకేజీలను అందించారు.
ప్రచారం ముగిసింది పోరు మిగిలే ఉంది. రాష్ట్రంలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 182 మండలాల పరిధిలోని 3,752 పంచాయతీల సర్పంచ్ లకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్విడుదల చేసిన ఎన్నికల సంఘం బుధవారం మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 3,752 సర్పంచ్పదవులకు 12,652 మంది అభ్యర్థులు, 28,410 వార్డు సభ్యులకు 75,725 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వారిని ఎన్నుకోవడానికి 53,06,401 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 140 మంది ఉన్నారు. వీరి కోసం 36,483 పోలింగ్కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడో విడతలో ఇప్పటికే 394 మంది సర్పంచ్లు, 7,908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 సర్పంచ్స్థానాలకు ఒక్కరూ సైతం నామినేషన్దాఖలు చేయలేదు. 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్కూడా దాఖలు కాలేదు.
గ్రామాలను చుట్టేసిన నేతలు
మూడో విడత ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించగా వారికి మద్దతుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు గ్రామాలు, వాడలను కలియతిరిగారు. అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించడం, హామీలు ఇస్తూ, పార్టీల్లో చేరే విధంగా ప్రచారం చేశారు. మద్యం, డబ్బు, చీరలు, ఇతర వస్తుసామగ్రిని పెద్దఎత్తున పంపిణీ చేశారు.
డబ్బు, మద్యం సీజ్
ఎన్నికల కోడ్లో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు రూ.9.11 కోట్ల విలువైన మద్యం, నగదు, ఇతర వాటిని పట్టుకున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండటానికి గతంలో నేర చరిత్ర ఉన్న 36,165 మందిని బైండోవర్చేశారు. 912 ఆయుధాలను వెనక్కి తీసుకున్నారు. రూ.2.09కోట్ల నగదును పట్టుకోగా, రూ.3.81 కోట్ల మద్యాన్ని సీజ్ చేశారు. రూ.2.28కోట్ల విలువైన డ్రగ్స్, రూ.90లక్షల విలువైన వస్తువులు, ఇతర వాటిని స్వాధీనం చేసుకున్నారు.