KCR: ఆ రెండు పార్టీలు పాలమూరుకు ద్రోహం చేశాయి: కేసీఆర్‌

 

హైదరాబాద్‌: 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌.. 20ఏళ్లు పాలించిన తెదేపా పాలమూరుకు ద్రోహం చేశాయని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటే తెలంగాణ, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారింది. ఇవాళ్టి సమావేశం ప్రధాన ఎజెండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం. కేంద్రం, రాష్ట్రం.. పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే చర్చ జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. ఆ జిల్లా ప్రాజెక్టులకు 174 టీఎంసీలు రావాల్సి ఉంది.


పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తోంది. ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించా. బచావత్‌ ట్రైబ్యునల్‌ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారు. 1974లో బచావత్‌ ట్రైబ్యునల్‌ 17 టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించింది. కానీ, బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులను పట్టించుకున్నవారే లేరు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశాం. పాలమూరు జిల్లాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. చంద్రబాబు పెండింగ్‌ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. భూ గర్బజలాల ద్వారా మరో లక్షన్నర ఎకరాల ఆయకట్టు వచ్చింది. పాలమూరు జిల్లాకు 170 టీఎంసీలు తీసుకెళ్లాలన్నది బీఆర్‌ఎస్‌ సర్కారు వ్యూహం.



కాంగ్రెస్‌ ప్రభుత్వం.. సర్వభ్రష్ట ప్రభుత్వం

‘‘పాలమూరు జిల్లాలో చెరువుల లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించాం.  చంద్రబాబు మాటలు విని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. భాజపా ప్రభుత్వం మొదటి నుంచి మాకు శనిలా దాపురించింది. ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయినా పాత ప్రాజెక్టులను కొనసాగించాలి కదా. రెండేళ్లయినా పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టయినా తీయలేదు. ఎంత సేపూ భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా? రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం. కేవలం 40 టీఎంసీలు చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతాం. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామ గ్రామాన  ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం.. సభలకు నేనూ వస్తా. ఈ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇకపై మౌనంగా ఉండేది లేదు.. పాలమూరుపై కేంద్రాన్ని ఎండగడతాం.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నోరుమూసుకుని ఉంటే.. మేమైనా పూనుకోవాలి కదా. కళ్లముందే ఇంత మోసం జరుగుతుంటే కేసీఆర్‌ మౌనంగా ఉంటారా? అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నా. ఇవాళ్టి వరకూ ఒక కథ..రేపటి నుంచి మరో కథ. తెలంగాణ కోసం ఎందాకైనా పోరాడతాం.. ఎలాంటి మొహమాటాలు ఉండవు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. సర్వభ్రష్ట ప్రభుత్వం’’ అని కేసీఆర్‌ విమర్శించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow