ఓవైపు ఏకగ్రీవాలు - మరోవైపు జోరుగా ప్రచారాలు : పల్లెల్లో ఎన్నికల హీట్


 Telangana Panchayat Elections 2025 : ఓవైపు ఏకగ్రీవాలు, మరోవైపు పోటాపోటీ ప్రచారాలతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తొలి విడత పోలింగ్‌ జరిగే గ్రామాల్లో పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థుల తరఫున అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగారు. రాష్ట్రంలోని పల్లెలన్నింటిలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. సర్పంచ్‌ పీఠమెక్కేందుకు ఆశావహులు, అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. దశాబ్దాల వైరానికి తెరదించుతూ ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని కలకోట గ్రామస్థులు సర్పంచిని ఏకగ్రీవం చేసుకున్నారు.

ఈ గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా రెండు ప్రధాన పార్టీల మధ్య శత్రుత్వంతో రాజకీయ హత్యలు కూడా జరిగేవి. ఘర్షణలు సరికాదని, సర్పంచ్‌తో పాటు 10 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. సర్పంచిగా పైడిపల్లి కిశోర్ సతీమణి అనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో కలెక్టర్ హనుమంతరావు పిలుపునకు ప్రజలు స్పందించారు. జలాలపూర్ గ్రామానికి చెందిన కొందరు ఓటర్లు తాము డబ్బులు, బహుమతులకు తమ ఓటును అమ్ముకోమని తమ ఇళ్ల ముందు బోర్డులు ఏర్పాటు చేశారు.

అగ్ర నేతల ప్రచారం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి చొరవతో ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా పోతారం సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ప్రభాకర్‌ రెడ్డి విజ్ఞప్తితో ఒకరు నామినేషన్‌ ఉప సంహరించుకున్నారు. దీంతో సల్కం రేణుక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో బీఆర్​ఎస్​ బలపరిచిన అభ్యర్థి దాసరి సునీత రవీందర్ తరఫున గండ్ర వెంకట రమణా రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ బలపరచిన సర్పంచ్, వార్డు సభ్యులకు మద్దతుగా ప్రచారం నిర్వహంచారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వమే గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తోందని ఈటల అన్నారు.

ప్రత్యర్థి తరఫున ప్రచారం - పార్టీ నుంచి సస్పెండ్ : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో ప్రత్యర్థి అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న భాస్కర్ రెడ్డిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో బీఆర్​ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుంచాల శ్రీనివాస్‌రెడ్డి, గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాననే హామీతో ప్రచారం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని బాడవతండా పంచాయతీలో బీఆర్​ఎస్ బలపరిచిన సర్పంచ్‌, వార్డు అభ్యర్థులను అరెస్టు చేశారని, నామినేషన్లు ఉప సంహరించుకోమని ఒత్తిడి తెస్తున్నారని బీఆర్​ఎస్​ నేతలు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం నందిగామ, భానూరు గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్​ఎస్, బీజేపీ నాయకులు తమ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow