జడ్చర్ల : వ్యవసాయ పనుల నిమిత్తం మూడు రోజుల క్రితం కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ కింద ప్రమాదవశాత్తు పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల మండల పరిధిలోని చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన శివకుమార్–ఉమారాణి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు మణిదీప్ (5). శివకుమార్ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వ్యవసాయ అవసరాల కోసం మూడు రోజుల క్రితం షోరూమ్ నుంచి నూతన ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు.
ఆదివారం తన వ్యవసాయ పొలానికి ట్రాక్టర్‌ను తీసుకెళ్లి పనులు చేస్తున్న సమయంలో, ట్రాక్టర్ తాళం చెయ్యి (కీ) యథావిధిగా ఉండగానే శివకుమార్ ఇతర పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇదే సమయంలో ఆడుకుంటూ వచ్చిన మణిదీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కి అనుకోకుండా ఇంజిన్‌ను ఆన్ చేశాడు. ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకు కదలడంతో బాలుడు కింద పడిపోయాడు. వెంటనే ట్రాక్టర్ బాలుడిపై నుంచి వెళ్లడంతో మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు తేరుకుని వచ్చేసరికి కుమారుడు విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. కళ్లముందే తమ కుమారుడు ప్రాణాలు విడిచిపోతుండగా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. వ్యవసాయ పనుల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్ తమ చిన్నారి ప్రాణాలను తీస్తుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.