ఎండీ ఫ్రం లండన్ అవతారం ఎత్తిన
ఎంబీబీఎస్ ఎండీగా శంకర్ దాదా ఎంబీబీఎస్ లే కాదు.. అసలైన ఎంబీబీఎస్ లు కూడా తమకు లేని డిగ్రీలను తగిలించుకుని స్థాయికి మించిన వైద్యం అందిస్తూ రోగులను మోసం చేస్తున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వెలుగు చూసింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ)బృందం తనిఖీల్లో ఈ విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ నెల 28న మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా. కె మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డా. డి. లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు కౌన్సిల్ వైస్ చైర్మన్ డా. గుండగాని శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యుడు డా. ఇమ్రాన్ అలీ షాద్‌నగర్ ప్రాంతంలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. డా. ఆనంద కుమార్ చెట్టిపల్లి అనే వైద్యుడు (ఏబీపీ హాస్పిటల్) ఎంబీబీఎస్ మాత్రమే చదివి ఎండీ జనరల్ మెడిసిన్ ఫ్రం లండన్ గా పేర్కొంటూ మల్టీ స్పెషాలిటీ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా టీజీఎంసీ గుర్తించింది. దీంతో పాటు అదే హాస్పిటల్ లో ఎకో టెక్నీషియన్ తో 2డి ఎకో పరీక్షలు నిర్వహించి కార్డియాలజిస్ట్‌గా నివేదికలపై సంతకం చేస్తున్నారని టీజీఎంసీ వైస్ చైర్మన్ డా. జి. శ్రీనివాస్ తెలిపారు.
వీరితో పాటు ఈ తనిఖీల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న జి. బాలకృష్ణ, రాజు (కీర్తి పొలిక్లినిక్)తో పాటు అనుమతి, అర్హత లేకుండా అల్లోపతి వైద్య సేవలు అందిస్తున్న వెంకటేష్ (బాలాజీ పాలీ క్లినిక్), అనుమతులు లేకుండా ఫస్ట్-ఎయిడ్ సెంటర్ పేరుతో అల్లోపతి వైద్య సేవలు అందిస్తున్న భాస్కరాచారి (గణేష్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్).. విచ్చలవిడిగా ప్రమాదకరమైన స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ ఇస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని గుర్తించారు. వీరిపై కఠినమైన చర్యలకు కౌన్సిల్ సిద్ధమైంది.
డా ఆనంద్ కుమార్ కు నోటీసు ఇవ్వడంతోపాటు పై వారందరిపై చర్యలకు టీజీఎంసీ ఎథికల్ కమిటీకి సిఫార్సు చేస్తామని, సదరు 2డీ ఈకో టెక్నీషియన్ పైన కూడా ఎన్ఎంసీ, టీఎంపీఆర్ చట్ట ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ స్పష్టం చేసింది. నకిలీ వైద్యులపై ఫిర్యాదులపై 9154382727 కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని టీజీఎంసీ కోరింది. ప్రజారోగ్య పరిరక్షణ చేస్తూ ఆరోగ్య తెలంగాణ సాధించే వరకు నకిలీ వైద్యులపై తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని డా జి. శ్రీనివాస్ తెలిపారు.
Tags
Shadnagar