జడ్చర్ల : స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయలేని బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. తన సొంత గ్రామం రంగారెడ్డిగూడలో కేవలం 13 ఓట్లు మాత్రమే సాధించిన బీఆర్ఎస్ నాయకులకు తనను విమర్శించే హక్కు ఎక్కడిదని నిలదీశారు. రంగారెడ్డి గూడ ఒక్కటే తన ఊరు కాదని, నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లూ తనవేనన్నారు. తొలివిడత ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా 50శాతానికి పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా బీఆర్ఎస్ చాలా చోట్ల కనీసం అభ్యర్థులను కూడా పోటీలో పెట్టలేకపోయిందని విమర్శించారు. తొలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజాపూర్ మండలంలోని తన సొంత గ్రామం రంగారెడ్డి గూడ లో బీజేపీ అభ్యర్థి గెలవడాన్ని ఎమ్మెల్యే గా తన ఓటమి అంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తప్పు పట్టారు. రంగారెడ్డిగూడలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కేవలం 13 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేసారు. గతంలో లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఆయన సొంత గ్రామం ఆవంచలో బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ 560 ఓట్ల మెజారిటీతో గెలుపొందలేదా? అని ప్రశ్నించారు. అలాగే లక్ష్మారెడ్డి మంత్రిగా కొనసాగుతున్న సమయంలో కావేరమ్మపేట సర్పంచ్ గా బుక్కా వెంకటేశం గెలిచారని గుర్తు చేసారు. రంగారెడ్డి గూడ తన సొంత గ్రామం అని అక్కడ ఎవరు గెలిచినా వారు తన వాళ్లేనని స్పష్టం చేసారు.
ప్రస్తుతం రంగారెడ్డి గూడలో సర్పంచ్ గా గెలిచిన ఆనంద్ (రేవతి) గతంలో సర్పంచ్ గా, ఎంపీటీసీ గా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారని ఆ సానుభూతి కూడా ఈ ఎన్నికల్లో పని చేసిందని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డిగూడ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగిస్తానని తాను రెండేళ్ల కిందట గ్రామప్రజలకు మాట ఇచ్చానని, అయితే ఈ అంశం కోర్టులో ఉన్న కారణంగా ఆ వాగ్దానాన్ని ఇప్పటికీ నెరవేర్చలేకపోయానని, ఈ అంశం గురించి కూడా రంగారెడ్డిగూడ గ్రామస్తులు తనపై అలిగి ఉండవచ్చునని పేర్కొన్నారు. గ్రామంలో ఎవరు గెలిచినా వారిని తాను కలుపుకొనిపోతానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సింగిల్ గా పోటీ చేసారని, బీఆర్ఎస్, బీజేపీ నేతలు లోపాయిపారీగా ఒక్కటై పోటీ చేసారని అన్నారు. నవాబుపేట, ఊర్కొండ, రాజాపూర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 50శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారని వెల్లడించారు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతల కలహాల కారణంగా ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసిన చోట బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. ఊర్కొండ పంచాయితీలో కాంగ్రెస్ తరుఫున ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా అక్కడ కేవలం 19 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ గెలిచిందని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఐక్యత లోపించిన కారణంగా తొలి విడత ఎన్నికల్లో కొన్ని పంచాయితీలను కోల్పోయిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా కలహాలు మానుకొని అందరూ మరోసారి కలిసి కూర్చుని మాట్లాడుకొని ఐక్యంగా పోటీ చేయాలని హితవు చెప్పారు.