Australia Shooting: ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండి బీచ్ లో ఇద్దరు ముష్కరుల దాడికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం యూదుల హనుక్కా పండుగ బీచ్ కార్యక్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరు పోలీసు అధికారుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
సాజిద్ అక్రమ్ ది హైదరాబాదే- డీజీపీ
ఆస్ట్రేలియా కాల్పులపై తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన చేశారు. కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ కు చెందిన వాడిగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోనే బీకామ్ చేసిన సాజిద్.. 1998 నవంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాడు. ఉద్యోగం కోసమే ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్.. 27 ఏళ్లలో ఇండియాకి 6 సార్లు మాత్రమే వచ్చినట్లు డీజీపీ తెలిపారు. తండ్రి మరణించినప్పుడు కూడా సాజిద్ ఇండియాకి రాలేదని వెల్లడించారు.
ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాది అక్రమ్ మరణించాడు. హైదరాబాద్‌కు చెందిన అక్రమ్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ భారత పౌరసత్వం రద్దు చేసుకోలేదని తెలంగాణ పోలీసులు మంగళవారం తెలిపారు.
సాజిద్ అక్రమ్ ఎవరు?
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ’50 ఏళ్ల సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడు. ‘1998 నవంబర్‌లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. సాజిద్ హైదరాబాద్‌లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశాడు’ అని తెలిపారు.
27 ఏళ్లుగా సాజిత్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ఈ సమయంలో సాజిత్ హైదరాబాద్‌లోని అతని కుటుంబంతో చాలా తక్కువ సార్లు మాట్లాడాడు. భారత్ కు చెందిన వాడైనప్పటికీ , ఇక్కడ ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పోలీసులు స్పష్టం చేశారు. అక్రమ్ చివరిసారిగా 2022లో హైదరాబాద్‌కు వచ్చాడు. భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగిన అక్రమ్ పిల్లలు ఆస్ట్రేలియాలోనే పుట్టారు.