తనకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదని నటుడు శివాజీ (Sivaji) అన్నారు. మహిళల దుస్తులపై ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా అవి తీవ్ర దుమారం రేపడంతో ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. తమ ఎదుట హాజరు కావాల్సిన ఆదేశించింది. దీంతో నటుడు శివాజీ శనివారం కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసి వివరణ ఇచ్చారు.
అనంతరం శివాజీ మాట్లాడుతూ.. ‘‘నేను ఏం తప్పు చేశానని నా మీద ఇంత కోపం. మీ అమ్మానాన్న మీ ఇంట్లో మీకు జాగ్రత్తలు చెప్పరా? ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే నాకేంటి? ఎవరి దుస్తులు వారి ఇష్టం. ఇంతకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదా? వారి మీద ఇలానే మాట్లాడారా? సినిమా ప్రమోషన్ కోసం అని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. ‘దండోరా’ ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్‌కు కమిషన్ నాకు నోటీసులు ఇచ్చింది. నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డవారి తరఫున కమిషన్ ప్రశ్నలు అడిగింది. వాటికి నేను సమాధానం చెప్పా. నేను ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లాయి. నాపైన కుట్ర జరుగుతోంది. నాతో కెరీర్ మొదలు పెట్టిన వారికి నాపై కోపం ఉంది. నా వ్యాఖ్యల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ పెట్టుకుని చర్చించారు. నాకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు’’
‘‘శివాజీ తప్పు చేశాడనుకుంటే రండి మాట్లాడుకుందాం. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత గోప్యంగా ముందుకు వెళ్తోంది. ఎవరి హక్కులకు భంగం కలిగినా రక్షించే వ్యవస్థలు ఉన్నాయి. సలహాలు ఇవ్వటం మానుకోవాలని నాకు అర్థమైంది. కమిషన్ అడిగిన వాటికి సమాధానం చెప్పాను. ఇంకా వివరణ ఇవ్వాల్సి వస్తే మళ్లీ కమిషన్ ముందుకు వస్తా. వాళ్లకు నచ్చని ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. సినిమాలు రాకపోతే, వ్యవసాయం చేసుకొని బతుకుతా. నాది రైతు కుటుంబం. నేను ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదు’’
‘‘అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ‘నువ్వెంత.. నీ బతుకెంత’ అని అంటున్నారు. ఎవరి బెదిరింపులకు నేను భయపడను. ఆత్మాభిమానం చంపుకొని అస్సలు బతకను. అదే సమయంలో వ్యవస్థలను, నేనుండే చిత్ర పరిశ్రమను గౌరవించకుండా విలువల్లేని బతుకు కూడా బతకడం లేదు. ప్రతి ఒక్క దానికి కాలమే సమాధానం చెబుతుంది. నాగబాబు గారు ఏమన్నారో చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరూ మాట్లాడలేరు. ఈ భూమ్మీద ఎవరిని ఎవరూ సంతృప్తి పరచలేరు. ‘యథార్థ వాది లోక విరోధి’’ అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.