Telangana Rising Global Summit MoU : గ్లోబల్ సమిట్‌లో తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు భారీగా వివిధ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. తొలి రోజే సుమారు 1.88 లక్షల కోట్ల ఎంవోయూలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేష్ రంగాల్లో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగాయి.
వివిధ రంగాలు కంపెనీలతో ఒప్పందాలు..
- డీప్ టెక్నాలజీ రంగంలో రూ. 75 వేల కోట్ల ఒప్పందాలు
- సాంప్రదాయేతర ఎనర్జీలో రూ. 39 వేల 700 కోట్లు
- గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 27 వేల కోట్లు
- ఏరోస్పేష్, డిఫెన్స్ రంగాల్లో రూ. 19 వేల 350 కోట్లు
- ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూప్ రూ. 15 వేల కోట్లు
- తయారీ రంగంలో రూ. 13 వేల 500 కోట్లు
- ఉక్కు రంగంలో రూ. 7 వేల కోట్లు
- టెక్స్‌టైల్ రంగంలో రూ. 4 వేల కోట్లు
భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యాం : ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ కారును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ కారును నడిపారు. తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యామని విన్ గ్రూప్ సీఈవో ఫాం షాన్‌చౌ వెల్లడించారు. రూ.27వేల కోట్ల పెట్టుబడులపై ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు. టెక్నాలజీ, గ్రీన్ ఇనర్జీ, హాస్పిటల్స్, వర్సిటీల్లో పెట్టుబడులు పెడతామన్నారు.
ఆసియా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యంపై గ్లోబల్ సమ్మిట్‌లో చర్చ జరిగింది. ఈ చర్చలో మలేషియా మంత్రి ముస్తఫా, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసియా దేశాలకు చెందిన 2 కీలక కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వియత్నాంకు చెందిన విన్ గ్రూప్‌తో రూ.27వేల కోట్ల ఒప్పందం చేసుకున్నామని, విన్ గ్రూప్ సోలార్‌ప్లాంట్లు, ఈవీ, ఎనర్జీ స్టోరేజీ ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు.
ఏఐ ఆధారిత సెంటర్లు : విన్ గ్రూప్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ కంపెనీ రూ.70వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. సింగపూర్‌కు చెందిన ఏజీఐడీసీ ఏఐ ఆధారిత డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మెడికల్, ఎకో, స్పిరిట్యువల్ టూరిజంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న ఆయన టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ వంటివాటిపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో కొత్తగా అంతర్జాతీయ స్థాయి జూ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ నిర్వహిస్తున్న అతిపెద్ద వన్యప్రాణి పునరావాస కేంద్రం ప్యూచర్ సిటీలో ఏర్పాటుకు ముందుకురావడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో వంతారా బృందం అటవీ శాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ : జంతువులకు వంతారాలో ఉన్న సదుపాయాలన్నీ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే జూ పార్క్‌లో ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. అందుకోసం ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నెల చివరలో వంతారాని సందర్శిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వన్యప్రాణులకు సేవ అనే నినాదంతో వంతారా పనిచేస్తోందని కొనియాడారు