సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ దగ్గర పడుతుంటే ప్రశాంతంగా విధులు ముగించాలని చూస్తారు. కానీ కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు మాత్రం ఆ కోవకు చెందిన వారు కాదు. ఇంకా ఐదు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఉన్నతాధికారులను ఆశ్చర్యపరుస్తూ ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. కన్నతల్లిని పుట్టినరోజు మరవకూడదని భావించాడు. తన పుట్టిన ఊరు కోదాడ మండలం గుడిబండ గ్రామానికి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచి సేవ చేయడమే లక్ష్యంగా వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎస్సై స్థాయికి ఎదిగాడు. తన ఉన్నతికి తోడ్పాటు అందించిన గ్రామానికి కృతజ్ఞతగా తిరిగి సేవ చేయాలనే భావించాడు వెంకటేశ్వర్లు.
ఇదే సమయంలో రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చాయి. గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్‌గా బరిలోకి దిగాలని వెంకటేశ్వర్లు నిర్ణయించాడు. ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేసేందుకు సర్పంచ్ బరిలోకి దిగుతున్నాడు. ఖాకీ డ్రెస్ వదిలి తెల్లచొక్కాతో ప్రజాసేవకు సిద్ధమైన ఎస్సై పులి వెంకటేశ్వర్లు నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉన్నతమైన పోలీసు అధికారి పదవిని దానికి ఉన్న గౌరవాన్ని వదులుకొని గ్రామ స్థాయి రాజకీయాల్లోకి రావడం వెనుక పులి వెంకటేశ్వర్లు అంకితభావం, బలమైన లక్ష్యం కనిపిస్తున్నాయి. కేవలం సర్పంచ్ అనే హోదా కోసం కాకుండా తనను కానిస్టేబుల్ నుండి ఎస్సైగా తీర్చిదిద్దిన గ్రామానికి రుణం తీర్చుకునే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది.ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ మూలాలను మర్చిపోకుండా గ్రామ స్థాయి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావడం సమాజంలో సానుకూల మార్పుకు నాంది పలికినట్లయ్యింది.
వెంకటేశ్వర్లు తీసుకున్న ఈ నిర్ణయం గ్రామ రాజకీయాల్లో నూతన ఒరవడికి దారి తీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన ఎస్సై పులి వెంకటేశ్వర్లు తాను తీసుకున్న నిర్ణయం వెనుక గల భావోద్వేగాన్ని బలంగా వ్యక్తం చేశారు. నేను తీసుకున్న వీఆర్ఎస్ కేవలం సెలవు కాదని గ్రామ సేవకు వేసిన మొదటి అడుగని మిగిలిన ఐదు నెలల పదవీ కాలాన్ని వదులుకోవడానికి నాకు ఏ మాత్రం బాధ లేదని వెంకటేశ్వర్లు చెబుతున్నారు. సర్పంచ్‌గా గెలిచి నా సొంతూరును రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే సంకల్పంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సై స్థాయి అధికారి తమ సేవ కోసం వస్తున్నందుకు గుడిబండ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుభవం గ్రామానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.