Delhi Blast: ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..


 ఢిల్లీ పేలుళ్ల ఘటనలో ఆత్మాహుతి దాడిగా పరిగణిస్తున్న దర్యాప్తు బృందం.. సంబంధిత వ్యక్తిని గుర్తించి, ఫొటోను విడుదల చేసింది. సోమవారం దేశ రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పేలుళ్ల(Delhi Blast) కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డా.ఉమర్ మహమ్మద్(Umar Mohammad) ముఖచిత్రం బయటపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట(Red Fort) సమీపంలో పేలిన వైట్ హ్యుండాయ్ ఐ20(Hundai I20) కారు ఉమర్‌కు చెందినదిగా పోలీసులు తేల్చారు. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించగా, 20 మంది క్షతగాత్రులయ్యారు. దీనిని ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న పోలీసులు.. అతడి ముఖాన్ని యాక్సెస్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి జమ్ము కశ్మీర్ లో అతడి తల్లి, సోదరులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.

చేతులు మారిన కారు..

దాడిలో ఉపయోగించిన కారు అనేకసార్లు చేతులు మారిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తొలుత ఆ కారును గురుగ్రామ్‌కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి 2025 మార్చిలో ఓఖ్లాలోని దేవేందర్‌కు అమ్మాడు. ఆ తర్వాత దేవేందర్ దానిని అంబాలా వాసికి విక్రయించాడు. ఆ వ్యక్తి నుంచి అమీర్‌కు, ఆపై తారిఖ్, ఉమర్‌లకు చేతులు మారి పుల్వామాకు చేరింది. అక్కడ అమీర్, తారిఖ్, రశీద్‌ల మధ్య సంబంధాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో అమీర్, తారిఖ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఢిల్లీ పోలీసులు.


వైద్యులుగా పనిచేస్తూ..

ఫరీదాబాద్ నుంచి ఇటీవల అనేక మంది వైద్యులు అరెస్ట్ కాగా.. వారు ఉగ్రవాద దాడికి ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వీరిలో అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల(జీఎంసీ) వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ ఒకడు. అతడు.. శ్రీనగర్‌లోని జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థకు మద్దతుగా పోస్టర్లు వేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుసుకున్న పోలీసులు.. ఈనెల 6న ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఓ ఆసుపత్రిలో అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేయగా.. ముజామ్మిల్ షకీల్ అనే మరో వైద్యుడికి ఇందులో సంబంధమున్నట్టు తేలింది. అతణ్ని ఈనెల 10న అరెస్ట్ చేశారు. షకీల్‌ను అరెస్ట్ చేసిన మాడ్యూల్లోనే ఓ మహిళా వైద్యురాలు షహీన్ షాదిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె కారులోంచి ఒక ఏకే-47 రైఫిల్, లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow