మీ కాళ్లు మొక్కుతా బాంచన్.. మా పత్తి కొనండి సారు..!


 జడ్చర్ల : సీసీఐ కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నాం. తమ పత్తి కొనుగోలు చేయండి అంటూ సీసీఐ అధికారుల కాళ్లు మొక్కాడు ఓ రైతు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కుర‌వ‌డంతో పత్తి పంట దెబ్బతిని దిగుబడి బాగా తగ్గడం దానికి తోడు ఉన్న కాస్తయినా పత్తిని అమ్ముకుందామంటే సీసీఐ అధికారుల కాళ్లు మొక్కినా కనికరించకుండా చుక్కలు చూపిస్తున్నారు అని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల పట్టణ కేంద్రంలో మహేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో గద్వాల జిల్లా అలంపూర్ రైతులు 90 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. మూడు రోజుల తర్వాత 30 క్వింటాళ్ల పత్తిని తీసుకొని, మిగతా పత్తిని తీసుకోవడానికి సీసీఐ అధికారులు నాణ్యత, తేమశాతం పేరుతో కొర్రీలు పెడుతూ కొనడానికి నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతు సీసీఐ అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా మాత్రం అధికారులు కనికరించడం లేదని ఆగ్రహించి తాము పండించిన పత్తి నీ రోడ్డుపై పారబోస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ పత్తిని కొనుగోలు చేయాలంటూ రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రంలో నిరసనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించి పంటను రోడ్డుపై చల్లవద్దని సీసీఐ అధికారులకు చెప్పి త్వరగా కొనుగోలు చేసే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow