మహబూబ్ నగర్ కూరగాయల మార్కెట్ లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏం కొనేటట్లు లేదు. ఏం తినేటట్లు లేదని సామాన్యులు వాపోతున్నారు. టమాటా, వంకాయ, పచ్చి మిరపకాయలు, క్యాప్సికం కిలో 80 రూపాయలుండగా.. బెండ, దొండకాయలు కిలో 70 రూపాయలు పలుకుతున్నాయి. మునగ కాయలు ఎప్పుడూ లేనంతగా రూ.400 కిలో అంట, సోరకాయ కిలో 60 రూపాయలకు పెరిగింది. 10 రూపాయలకు ఇచ్చే పాలకూర కట్ట 20 రూపాయలకు తగ్గేదేలే అంటున్నారు. మిగతా రకాల ఆకుకూరలైతే దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. పట్టణంలోని వివిధ కాలనీలకు సమీపంలో అమ్ముతున్న వ్యాపారస్తులు మరీ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.
అకాలంగా కురిసిన భారీ వర్షాలకు పంట దిగుబడి పూర్తిగా తగ్గింది
ఈ సారి అకాలంగా కురిసిన భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావంతో రోజుల తరబడి కురిసిన తుఫాన్ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిని, ఉత్పత్తి కూడా పూర్తిగా తగ్గిందని మహబూబ్ నగర్ మార్కెట్ యార్డు చిరు వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు మాడమోని చందు అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా కూరగాయల దిగుమతి పూర్తిగా తగ్గిపోయిందని, అందుకే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇంకొన్ని రోజుల్లో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Tags
mahabubnagar