సన్నధాన్యం బోనస్ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ : కలెక్టర్ విజయేందిర బోయి

 

వానాకాలం (ఖరీఫ్) 2025-26 సీజన్ సందర్భంగా జిల్లాలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు కోసం నవంబర్ మొదటి వారం నుండి మొత్తం 190 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ధాన్యం కొనుగోలు కార్యక్రమం క్రమంగా వేగం అందుకుంటూ, నేటి వరకు 13,705 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2,394 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపినట్లు ఆమె వివరించారు. ఇప్పటి వరకు 320 మంది రైతులకు 4.33 కోట్లు ఎంఎస్పీ చెల్లింపులు జారీ చేయడం జరిగిందని, కొనుగోలు వేగవంతం, కేంద్రాల ఇన్‌చార్జీల ద్వారా ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయడానికై ప్రతి రోజూ తాను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి సమీక్షలు నిర్వహిస్తూ కొనుగోలు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సీజన్‌ లో పొల్కంపల్లి పిపిసీ లో 5 మంది రైతులు 304.800 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని విక్రయించగా, వారికి ఎంఎస్పీ తో పాటు బోనస్ మొత్తం 1,52,400 రూపాయలను ప్రభుత్వ ఖాతా నుండి జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఎంఎస్పీ జమ అయిన తరువాత బోనస్ మొత్తం కూడా ఒక వారం లోపే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారన్నారు. ఇప్పటి వరకు 78 మంది రైతులకు సంబంధించిన బోనస్ మొత్తం 21.67 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖాతా నుండి ప్రాసెస్‌ లో ఉండగా, ఇవి తదుపరి 2 నుండి 4 రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయని, రైతులు దళారులను నమ్మి తమ పంటను తక్కువ ధరకు అమ్మకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మాత్రమే తీసుకురావాలని జిల్లా అధికారులు సూచించారు. బోనస్ అందదనే వదంతులను నమ్మవద్దని, అన్ని చెల్లింపులు విధివిధానాల ప్రకారం జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. రాబోయే వారం నుండి ధాన్యం కొనుగోళ్లు ఇంకా వేగాన్ని సంతరించుకుంటాయని అధికారులు తెలిపారు. రైతుల వివరాలను సమయానికి ఓపిఎంఎస్ లో నమోదు చేయుటకు పిపిసీ, ట్యాబ్ ఇన్‌చార్జీలతో రోజువారీ సమీక్షలు జరుపుతూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow