హెటిరో కాలుష్య పరిశ్రమను మూసివేయండి- మృతి చెందిన పశువులతో ఆ గ్రామ ప్రజల వినూత్న నిరసన


 జిన్నారం: తమ ఊరిని నాశనం చేస్తున్న కాలుష్య పరిశ్రమలపై దోమడుగు గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న హెటిరో యూనిట్–1 పరిశ్రమ కారణంగా నల్లకుంట చెరువు విషతుల్యమై పశువులు మృతి చెందుతున్నాయని, గ్రామ ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. కాలుష్యంతో చనిపోయిన పశువుల ప్రతి రూపాలను ఊరేగింపులో ప్రదర్శించి, బోర్ల నీటిని బాటిళ్లలో తీసుకువచ్చి ప్రదర్శించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కాలుష్యకారక కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. కలుషిత జలాల కారణంగా చిన్నపిల్లలు, పశువులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, దోమడుగు బియ్యం మార్కెట్లో కొనరాదని కొందరు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో జీవనాధారం కూడా ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. పీసీబీ అధికారులు కేవలం నమూనాలు మాత్రమే సేకరించి, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అవినీతి పాల్పడిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు హెటిరో యూనిట్–1 పరిశ్రమను తక్షణమే మూసివేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. తమ ఊరిని రక్షించే వరకు వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. డాక్టర్ కలపాల బాబూరావు మాట్లాడుతూ, నల్లకుంట చెరువు నీరు తీవ్ర స్థాయిలో కలుషితమైందని, ప్రజలు ఐక్యంగా నిలబడి పర్యావరణ రక్షణకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజా జేఏసీ నాయకులు కన్నెగంటి రవి, అశోక్ కుమార్ లు మాట్లాడుతూ దోమడుగు ప్రజల ఐక్యతతోనే విజయం సాధ్యమని అన్నారు. జాతీయ ప్రజా ఉద్యమ సమాఖ్య నాయకురాలు మీరా సంఘమిత్ర, ప్రజా జేఏసీ నాయకులు రాజగోపాల్ రెడ్డి, ముత్యాలు, దీప్తి, హేమంత్ తదితరులు ఈ నిరసనకు మద్దతు తెలిపారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow