సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ప్రయోగాత్మకంగా 'ఈ కుకుంగ్' అమలు - కొండారెడ్డి పల్లిలో ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్లు పంపిణీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి ఓ వినూత్న ప్రయోగానికి వేదికైంది. అక్కడ ప్రతి ఇంటికి పూర్తి ఉచితంగా సౌర విద్యుత్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. వంటకు ఉపయోగపడే ఇండక్షన్ స్టవ్, కుక్కర్లను మహిళలకు పంపిణీ చేశారు. కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ‘ఈ-కుకింగ్ లేదా క్లీన్ కుకింగ్’ పేరుతో ఓ ప్రత్యేక పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. విద్యుత్‌తో పని చేసే ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంతో గ్యాస్ సిలిండర్ల వాడకం బాగా తగ్గించవచ్చనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే ఉచితంగా కరెంటు లభిస్తుందని, దాంతో ఇండక్షన్ స్టవ్‌ను వినియోగిస్తే కరెంటు బిల్లు పెరుగుతుందనే భయం కూడా ఉండదని ఈ పథకం అమలుకు రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీగా పని చేస్తున్న రెడ్కో పేర్కొంది.
వడ్డీతో వచ్చే సొమ్ముతోనే : తెలంగాణ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.6 కోట్లతో రాష్ట్ర ఇంధన పరిరక్షణ నిధిని ఏర్పాటు చేశాయి. దీనిని ఖర్చు పెట్టకుండా అలాగే ఉంచడంతో కొంత వడ్డీ కూడా సమకూరింది. ఈ నిధిని వినియోగించకుంటే వెనక్కి తీసేసుకుంటామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) హెచ్చరించింది. రాష్ట్ర విద్యుత్‌శాఖ దీనిపై చర్చించి ఈ నిధిపై వచ్చిన వడ్డీని మాత్రమే వినియోగించి స్టవ్‌లు, కుక్కర్లను కొని కొండారెడ్డిపల్లిలో మహిళలకు ఉచితంగా పంపిణీ చేసేయాలని నిర్ణయించింది.
ప్రజలకు అవగాహన కల్పించాం : తొలిసారిగా 1,300 వాట్ల సామర్థ్యంతో పనిచేసే ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌తో పాటు, దానిపై వంట చేసుకునేందుకు 5 లీటర్ల సామర్థ్యం గల కుక్కర్లను రెడ్కో కొనుగోలుచేసి కొండారెడ్డిపల్లిలోని ప్రతి ఇంటి మహిళకు అందజేసింది. ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల స్థాపిత సామర్థ్యంతో సౌరవిద్యుత్‌కు ఏర్పాట్లు చేసినందున నెలకు సుమారు 360 యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఈ గ్రామంలో అత్యధిక ఇళ్లలో విద్యుత్ వినియోగం 200 నుంచి 300 యూనిట్లలోపే ఉంది. ఈ నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్‌తో వంట చేసుకున్నా ఇంకా కరెంటు మిగులుతుందని ప్రజలకు అవగాహన కల్పించినట్లుగా రెడ్కో ఎండీ అనిల ‘ఈనాడు’కు చెప్పారు
దీనివల్ల ప్రయోజనాలివే : -
- పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రోత్సాహం
- తరిగిపోయే ఇంధన వనరైన గ్యాస్ వాడకాన్ని తగ్గించవచ్చు
- పర్యావరణానికి నష్టం కలుగకుండా ఉంటుంది
- సహజవనరైన సౌరశక్తిని ఎప్పటికీ తరిగిపోని వనరు
ఆదర్శ సౌర గ్రామాల పథకం : తెలంగాణ ప్రభుత్వం "ఆదర్శ సౌర గ్రామాల పథకం" అమలుకోసం అంచనా వ్యయం తొలుత నిర్దేశించిన దానికంటే భారీగా పెరిగింది. ఈ స్కీమ్ కింద టెండర్లు పిలవడానికి ముందు రూ.775.01 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా అదనంగా రూ.168.46 కోట్లు పెరిగి అది రూ.943.47 కోట్లకు చేరుకుంది. అయితే అదనంగా పనలు చేపట్టాల్సి రావడమే ఇందుకు కారణమని రాష్ట్ర విద్యుత్ శాఖ పేర్కొంది. పెరిగిన వ్యయానికి అనుగుణంగా నిధులు విడుదలకు పరిపాలనా అనుమతినిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.