మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో సోమవారం వైద్యం వికటించి లలిత అనే మహిళ మృతి చెందింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కోడూరు గ్రామానికి చెందిన లలిత మూడు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ పట్టణంలోని రాయిచూర్ రోడ్డులో ఉన్న శ్రీ ఆసుపత్రిలో చేరింది. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే లలిత మృతి చెందిందని, చనిపోయాక కూడా వైద్యచికిత్సల పేరిట లక్ష రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తూ, మృతి చెందిన మహిళ బంధువులు ఆస్పత్రి వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వర్గాలకు మృతురాలి బంధువులకు వాదోపవాదాలు జరిగాయి. ఒక దశలో స్థానికుల సహాయంతో ఆసుపత్రి పై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులు, బంధువులు రెచ్చిపోయి ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లపైకి దాడికి యత్నించగా వన్ ఎస్ఐ శీనయ్య చాకచక్యంగా వ్యవహరించి ఇరు వర్గాలను శాంతింపజేసి ఆందోళనను సద్దుమణిగేలా కృషి చేశారు.
Tags
mahabubnagar