69 కి.మీ.. 50 మృత్యు మలుపులు

రక్తమోడుతున్న హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి
ఐదేళ్లలో ప్రమాదాల్లో 211 మంది మృతి

హైదరాబాద్‌- చేవెళ్ల రూరల్, శంకర్‌పల్లి, షాబాద్, న్యూస్‌టుడే: 69 కిలోమీటర్ల దూరం.. ఐదేళ్లలో 720 ప్రమాదాలు.. 211 మంది మృతి... 737 మంది క్షతగాత్రులు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నవారు వేలల్లో.. ఇది హైదరాబాద్‌- బీజాపూర్‌ (విజయపుర) జాతీయ రహదారి రక్తచరిత్ర. సోమవారం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ప్రమాదం జరిగింది ఇదే రహదారిపై. గత కొన్నేళ్లలో వాహనాల రాకపోకలు భారీగా పెరిగినా రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడం ఎన్నో ప్రమాదాలకు, విషాదాలకు దారితీస్తోంది. అప్పా జంక్షన్‌ నుంచి తాండూరు వరకు 69 కిలోమీటర్ల దూరం ఉండగా.. ఏకంగా 50 ప్రమాదకర మలుపులు ఉన్నాయి. మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్, మొయినాబాద్, చిన్నషాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, మీర్జాగూడ, ఆలూరు, అంతారం వద్ద ఉన్న మలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. మలుపుల కారణంగా అప్పా-మన్నెగూడ మధ్య ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వారానికి 3 నుంచి 5 ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది.


శంకుస్థాపన చేసినా విస్తరణకు బ్రేకులు
నిజాం కాలంలో నిర్మించిన రోడ్డిది. కర్ణాటకలోని బీజాపూర్‌కు వెళ్లడానికి నవాబులు వేసుకున్న రహదారి. హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని కలబురగి, బీజాపూర్‌లతోపాటు వికారాబాద్‌ జిల్లాకు వెళ్లేందుకు ఈ రోడ్డు కీలకం. పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండలకు వెళ్లడానికీ ఇదే మార్గం. మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. రైతులు పంట ఉత్పత్తులను తరలిస్తుంటారు. దీంతో రాకపోకలు గణనీయంగా పెరిగాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వాలు బీటీ వేస్తూ వచ్చాయి తప్ప ట్రాఫిక్‌ అవసరాల మేరకు విస్తరణ చేపట్టలేదు. 2018లో దీన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి-163గా మార్చింది. రూ.785 కోట్లతో అప్పా జంక్షన్‌ నుంచి వికారాబాద్‌ జిల్లాలోని మన్నెగూడ వరకు 46.40 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించేందుకు 2022లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం 145.42 హెక్టార్ల భూమిని సైతం సేకరించింది. అయితే విస్తరణ పనులకు ఆది నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ మార్గంలో పలువురు ప్రముఖుల స్థలాలు, ఫాంహౌస్‌లు ఉన్నాయి. మరోవైపు, ఈ మార్గం పక్కన 900కి పైగా మర్రి చెట్లు ఉన్నాయని.. వాటిని కొట్టేస్తే పర్యావరణపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటూ కొందరు ఎన్జీటీని ఆశ్రయించడంతో స్టే విధించింది. మర్రి చెట్లను తొలగించాల్సి వస్తే రీలొకేట్‌ చేస్తామని... పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రెండ్రోజుల కిందట ఎన్జీటీ స్టేను ఎత్తివేసింది. పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow