జడ్చర్ల : జార్ఖండ్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొచ్చి జడ్చర్లలో గ్రాముల చొప్పున విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 305 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జడ్చర్ల ఎక్సైజ్ సీఐ విప్లవ్ రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం జడ్చర్ల పరిధిలోని శివారులో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని వద్ద 305 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
నిందితుడిని స్టేషన్‌కు తరలించి విచారించగా, బండపల్ బండమీదిపల్లి శివారులోని ఆర్‌బీఆర్ కంపెనీలో వంటమాస్టర్‌గా పనిచేస్తున్నట్లు, జార్ఖండ్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకువచ్చి 500–10 గ్రాముల చొప్పున విక్రయిస్తున్నట్లు అతడు తెలిపినట్లు ఎక్సైజ్ సీఐ విప్లవ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి, నిందితుడిని రిమాండుకు పంపినట్లు ఆయన తెలిపారు. జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి క్రయవిక్రయాలు జరిపినట్లయితే 9030019943 నంబర్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు. గంజాయి కొనుగోలు లేదా విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టీ.కార్తీక్ రెడ్డి, కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థ్ పాల్గొన్నారు.
Tags
Jadcherla