3, 4 రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ : సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన - అక్షయపాత్ర ఫౌండేషన్‌ కిచెన్‌ను పరిశీలించిన సీఎం - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


 CM Revanth Reddy Public Meeting In Kodangal : కొడంగల్‌లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం (బ్రేక్​ఫాస్ట్​) అందిస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రభుత్వ బడుల్లో 5 వేల మంది విద్యార్థులు పెరిగారని ఆయన తెలిపారు. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి అక్కడి 'అక్షయపాత్ర ఫౌండేషన్‌ కిచెన్‌'ను పరిశీలించారు. మధ్యాహ్న భోజన కిచెన్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఎడ్యుకేషన్ హబ్​గా కొడంగల్​ : జీవితాల్లో మార్పు రావాలంటే పిల్లల్ని చదివించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్‌లో రూ.5 వేల కోట్లతో ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సైనిక్‌ స్కూల్‌ను ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. 16 నెలల్లోగా కొడంగల్‌ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. రాబోయే కొన్ని నెలల్లో నియోజకవర్గంలో రైల్వే పనులు ప్రారంభమవుతాయన్నారు. దేశానికే కొడంగల్‌ను ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేస్తామన్నారు.

మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని పునరుద్ఘాటించారు. వెయ్యి ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేశామన్నారు. సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ బంకులకు కూడా యజమానులను చేశామని చెప్పారు. అదానీ, అంబానీలతో పోటీపడేలా వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్‌లో అమ్ముకునేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కొడంగల్‌లో రూ.103 కోట్లతో అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

తెలంగాణ నోయిడాగా కొడంగల్‌ : మూడు నెలల్లో కొడంగల్‌లోని ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. లగచర్ల పారిశ్రామికవాడకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణ నోయిడాగా కొడంగల్‌ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే కొన్ని నెలల్లో కొడంగల్‌ రైల్వే పనులు ప్రారంభమవుతాయన్న ఆయన నియోజకవర్గంలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

త్వరలో సర్పంచ్‌ ఎన్నికలు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు. మరో 3, 4 రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి అని రేవంత్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు కొడంగల్​ నియోజకవర్గానికి విచ్చేసిన రేవంత్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు

"త్వరలో జరగబోవు సర్పంచ్​ ఎన్నికలు అత్యంత కీలకం. మంచివాళ్లను సర్పంచ్​లగా ఎన్నికొండి. పదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఈ కొడంగల్​ను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం. మన ఆర్థిక పరిస్థితిని బాగుచేయడానికి, అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్​ను ఎన్నుకున్నాం. 16 నెలల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపడుతున్నాం"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow