Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. జీఓ 9పై హైకోర్టు స్టే..

 


బ్రేక్‌తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో నేడు వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించి షాక్ ఇచ్చింది.

హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్‌ పడింది. ఇవాళ (గురువారం) బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండో రోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ 9పై స్టే విధించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే ఇచ్చి షాక్ ఇచ్చింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. అనంతరం రెండు వారాల్లోపు అన్ని పార్టీలు కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9 అమలుపై కోర్టు మధ్యంతర స్థాయిలో స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లు వేసిన తర్వాత.. అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. చివరగా.. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ విచారణను కోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బుధవారం, గురువారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే.. అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.


మరో న్యాయవాది రవివర్మ తెలంగాణ ప్రభుత్వం తరపున తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్‌ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్‌గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 9పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow