ఉదండాపూర్ భూసేకరణ అక్రమాలు బయటపెడతాం*


*ఉదండాపూర్ భూసేకరణ అక్రమాలు బయటపెడతాం*

• *జరిగిన అక్రమాలపై మరోసారి ఫిర్యాదు చేస్తాం*

• *గైరాన్, భూదాన్ భూముల పేరిట కూడా అక్రమాలు*

• *ప్రస్తుతం 23 మంది అక్రమార్కులకు నోటీసులు* 

• *రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రూ.3.84 కోట్ల రికవరీకి చర్యలు*

• *గతంలో ఉన్న రెవెన్యూ అధికారులకు కూడా తాఖీదులు*

• *అప్పటి ఎమ్మార్వో, ఆర్ఐ చేసిన ప్రజలు అక్రమాలపై సమాచారం ఇవ్వాలి*

• *ఫిర్యాదులు నేరుగా లేదా 9392017899 నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపాలి*

• *ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ*

జడ్చర్ల, అక్టోబర్ 21: ఉదండాపూర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో చేసిన భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలన్నీ బయటపెట్టి, బాధ్యులైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకొనేలా చూస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ అక్రమాలకు సంబంధించి కొంతమందికి ప్రస్తుతం నోటీసులు వచ్చాయని, వారితో పాటుగా భూములు లేకపోయినా గైరాన్, భూదాన్ భూములపై కూడా పరిహారాలు దిగమింగిన వారందరినీ బయటికి లాగుతామని హెచ్చరించారు. ఈ అక్రమాలకు సంబంధించిన బాధితులు, ప్రజలు కూడా తమ వద్ద ఉన్న సమాచారం కూడా తనకు అందించాలని కోరారు.

ఉదండాపూర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పరిహారాల చెల్లింపులో భారీ అవినీతి జరిగిందని, అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని తాను గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసానని మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి గుర్తు చేసారు. అయితే ఉదండాపూర్ భూసేకరణ పరిహారాల చెల్లింపులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అలా జరిగి ఉంటే అందుకు ఆధారాలు చూపాలంటూ అప్పట్లోనే బీఆర్ఎస్ నాయకులు చెప్పారని తెలిపారు. అయితే ఇదే విషయంగా పోలేపల్లి సర్వే నెంబర్ 554 సర్వే నెంబర్ లో భూములు లేకపోయినా ఎకరానికి రూ.12 లక్షలు చొప్పున అక్రమంగా పరిహారాలు పొందారనే విషయంగా రెవెన్యూ అధికారులు విచారణ చేసి ఈ ఒక్క సర్వే నెంబర్ మీదనే 23 మంది వ్యక్తులు అక్రమంగా రూ.3.84 కోట్ల రుపాయల పరిహారాన్ని దండుకున్నారని గుర్తించారని వెల్లడించారు. ఈ విషయంగా రెవెన్యూ అధికారిణి పద్మజ నిగ్గు తేల్చిన నిజం ఆధారంగా ప్రస్తుతం 23 మందికి నోటీసులు జారీ చేస్తున్నారని, వారు దిగమింగిన కోట్లాది రుపాయల మొత్తాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయడానికి చర్యలు చేపట్టారని వివరించారు. అయితే ఉదండాపూర్ లో జరిగిన అనేక అక్రమాలలో ఇది ఒకటి మాత్రమేనని, ఇంకా బయటకు రావాల్సిన అక్రమాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. ఒకరి పేరిట ఉన్న పట్టా భూముల పరిహారాన్ని మరొకరి ఖాతాలోకి బదిలీ చేయడం, అసలు పట్టాదారులకు మొండి చేయి చూపడం మాత్రమే కాకుండా గైరాన్, భూదాన్ లకు సంబంధించిన భూముల పేరిట కూడా అక్రమార్కులు కోట్లు దండుకున్నారని విమర్శించారు. జరిగిన ఈ అక్రమాలన్నింటినీ బయటకు తీసుకొస్తామని, అక్రమార్కులపై చర్యలు తీసుకొనేలా చూస్తానని ప్రకటించారు. ఈ అక్రమాలన్నీ అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల అండదండలతో, అప్పుడు పని చేస్తున్న రెవెన్యూ అధికారులే చేసారనే విషయం తన దృష్టికి వచ్చిందని అనిరుధ్ రెడ్డి చెప్పారు. అప్పట్లో జడ్చర్ల తహసీల్దార్ గా పని చేసిన లక్ష్మీనారాయణ, ఆర్.ఐ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోనే ఈ అక్రమాలు యధేచ్ఛగా జరిగాయనే ఆరోపణలు కూడా తనకు ప్రజల ద్వారా వచ్చాయని తెలిపారు. పోలేపల్లిలో సర్వే నెంబర్.554 లోజరిగిన అక్రమాలపై 23 మంది ప్రైవేటు వ్యక్తులతో పాటుగా అప్పటి తహసీల్దార్, ఆర్ఐలకు కూడా షోకాజ్ నోటీసులు వచ్చాయని తనకు తెలిసిందన్నారు. కాగా ఉదండాపూర్ భూసేకరణలో అధికారులు, బీఆర్ఎస్ నేతల అక్రమాల కారణంగా నష్టపోయిన బాధితులు, వీటికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు కూడా జరిగిన అక్రమాలకు సంబంధించిన వివరాలను తనకు అందించాలని అనిరుధ్ రెడ్డి కోరారు. తమకు తెలిసిన సమాచారాన్ని క్లుప్తంగా కాగితాలపై రాసి తనకు నేరుగా అందజేయాలని, తాను అందుబాటులో లేకపోతే తన క్యాంపు కార్యాలయంలో ఉండే పీఆర్వోకు నేరుగా లేదా వాట్సాప్ నెంబర్.9392017899 ద్వారా గానీ సమాచారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఉదండాపూర్ అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని తాను ప్రభుత్వానికి మరోసారి ఫిర్యాదు చేయనున్నట్లు అనిరుధ్ రెడ్డి వివరించారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow