Karthika Somavar Fasting Rules : తెలుగు పంచాంగం ప్రకారం ద్వాదశ మాసాల్లో కార్తిక మాసం ప్రత్యేకతే వేరు! నిజానికి కార్తిక మాసం మొత్తం పవిత్రమైనది. ఇందులో సోమవారాలు మరింత ప్రత్యేకమైనవి. ఈ నెల 27వ తేదీ కార్తిక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా ఈ రోజు శివారాధన ఎలా చేయాలి? కార్తిక సోమవార విశిష్టత ఏమిటి? ఉపవాసం ఎలా చేయాలి? ఫలితాలు ఎలా ఉంటాయి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కార్తిక సోమవారం విశిష్టత
శివకేశవులను ఇద్దరినీ సమానంగా ఆరాధించే మాసం కార్తిక మాసం. ఈ మాసంలో అన్ని సోమవారాలు విశిష్టమైనవి. స్కంద పురాణాంతర్గతమైన కార్తిక పురాణంలో వివరించిన ప్రకారం కార్తిక సోమవారం నాడు చేసే నదీ స్నానం, శివాభిషేకం, దీపారాధన, విష్ణు పూజ, జపతపాలు కోటిరెట్ల అధిక ఫలాన్ని ఇస్తాయని తెలుస్తోంది. ఇవేవి చేయలేక పోయినా 'హర హర మహాదేవ శంభో శంకర' అంటూ శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా చాలు మోక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
అత్యంత ఫలప్రదం కార్తిక సోమవారం పూజ
కార్తిక సోమవారం రోజు చేసే చిన్నపాటి పూజయినా అత్యంత ఫలప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీస్నానం చేసి శివాలయంలో శివలింగానికి అభిషేకం చేసి, దీపం వెలిగించి అనంతరం పురాణ పఠనం చేస్తే కలిగే ఫలం అనంతమని కార్తిక పురాణంలో వివరించి ఉంది.
సోమవారం ఉపవాసం తో కైలాస ప్రాప్తి
ఇక కార్తిక మాసంలో తెలిసో తెలియకో, అనుకోకుండా అయినా సరే చేసే ఉపవాసం వల్ల కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తిక సోమవారం రోజు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణంలో వివరించి ఉంది.
ఆరు రకాల ఉపవాస పద్ధతులు
కార్తిక పురాణంలో వశిష్ట మహర్షి వివరించిన ప్రకారం కార్తిక సోమవార వ్రతంలో ఆరు రకాల ఉపవాస పద్ధతులు ఉన్నాయి. అవేమిటంటే ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం మరియు తిలాదానం. ఇప్పుడు వీటి గురించి విపులంగా తెలుసుకుందాం.
ఉపవాసం : ఉపవాసం అంటే రోజంతా పూర్తిగా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం పాటించడం. ఈ పద్దతిలో మరుసటి రోజు ఉదయం స్నానం, ధ్యానం తరువాత మాత్రమే ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది.
ఏకభుక్తం : ఏకభుక్తం అంటే రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేయడం.
నక్తం : నక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో దీపాలు పెట్టి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయడం. ఎక్కువమంది ఈ విధానాన్ని పాటిస్తుంటారు.
అయాచితం : అయాచితం అంటే అనుకోకుండా ఎవరైనా ప్రసాదాన్ని కానీ భోజనం కానీ చేయమని అడిగినప్పుడు కాదనకుండా భుజించడం.
స్నానం : ప్రతి సోమవారం నదీ స్నానం చేయడం కూడా ఉపవాసంతో సమానమే అని ఋషులు చెప్పారు.
తిలాదానం : కార్తిక సోమవారం రోజు తిలలు అంటే నువ్వులు దానం చేయడం కూడా ఉపవాసంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతోంది.
కర్కశ కథ
పూర్వం కర్కశ అనే స్త్రీ ఎన్నో పాపాలు చేసి మరుసటి జన్మలో శునకంగా జన్మించింది. ఒక కార్తిక సోమవారం రోజు ఆ శునకానికి ఉదయం నుంచి ఎలాంటి ఆహారం దొరకక అనుకోకుండా అభోజనంగా ఉండాల్సి వచ్చింది. సాయంత్రం నక్షత్రాలు ఉదయించాక ఒక బ్రాహ్మణుడు కార్తిక సోమవారం వ్రతాన్ని ఆచరించి బలి భోజనాన్ని బయట విడిచి పెట్టినప్పుడు ఆ భోజనం తిన్న ఆ శునకానికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎంతో దయతో తాను ఆచరించిన కార్తిక సోమవారం వ్రత ఫలాన్ని ఆ శునకానికి ధారపోయగా ఆ శునకం తన పూర్వ జన్మ పాపాల నుంచి బయట పడి కైలాసానికి చేరుకున్న కథను మనం కార్తిక పురాణంలో చూడవచ్చు.
ఇంతటి మహిమాన్వితమైన కార్తిక సోమవారం రోజు మనం కూడా శివ కేశవులను పూజిద్దాం. మోక్షాన్ని పొందుదాం.
ఓం నమః శివాయ! ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః!