జాతర కోసం యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు - 10 లక్షల మంది వస్తారని అధికారుల అంచనా - వసతులు మెరుగుపరచాలని భక్తులు విజ్ఞప్తి
Kurumurthy Brahmotsavams in Mahabubnagar : పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా 10 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యే కురుమూర్తి జాతర కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. రద్దీ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వసతులు మెరుగుపరచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాగునీరు, మరుగు దొడ్లు, మూత్రశాలల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.
నెల రోజుల పాటు బ్రహ్మోత్సవాలు : మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట మండలం అమ్మాపురం సమీపంలోని సప్తగిరుల మధ్య కొలువైన కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. కార్తీక శుద్ద పాడ్యమి నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలు, నెల రోజుల పాటు సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం అలంకారోత్సవం, ఉద్దాల మహోత్సవానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారు. అశేషంగా తరలివచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక క్యూలైన్‌లు : ఏటా ఎదురవుతున్న పలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొండపైకి వెళ్లేందుకు కిందకు దిగేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎక్కువ మంది నుంచి ఉంది. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక క్యూలైన్‌లు, చోరీల నియంత్రణకు సీసీ కెమెరాలతో నిఘా, మొబైల్ టాయిలెట్ల పెంపు, పారిశుద్ధ్య నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. జాతరలో ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల బందోబస్తు : కురుమూర్తి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈఓ మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. గుత్తేదారులు అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కురుమూర్తికి చేరుకునే రహదారులు చాలాచోట్ల ధ్వంసమయ్యాయి. బ్రహ్మోత్సవాల వేళ తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టాలని భక్తజనం కోరుతున్నారు. కురుమూర్తి జాతర దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతను కల్పించనుంది. ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవానికి లక్షలాది మంది తరలివస్తారన్న అంచనా మేరకు అన్నీ రకాల వసతుల్నీ జిల్లా యంత్రాంగం సహా దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగనున్నాయి.
బంగారు ఆభరణాలతో అలంకార ఉత్సవం : స్వామి వారి కల్యాణ ఉత్సవం, శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారికి మయూర వాహన సేవ కార్యక్రమాలు ఉంటాయి. స్వామి వారికి హంసవాహన సేవ, శేషవాహన సేవ, స్వామి వారికి గజవాహన సేవ, బంగారు ఆభరణాలతో అలంకార ఉత్సవం, అశ్వవాహన సేవ, హనుమద్వాహన సేవ నిర్వహిస్తారు. ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం చిన్నచింతకుంట మండలంలోని చిన్నవడ్డెమాన్ నుంచి ప్రారంభమై జాతర మైదానానికి చేరుకుంటుంది. ఉద్దాలు కొండపైకి చేరుకున్న తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగిస్తారు. స్వామి వారికి అలంకరించిన బంగారు ఆభరణాలు తీయడంతో ఉత్సవాలు ముగుస్తాయి.