డిటిసిపి వెంచర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు




*అవసరమైన నిధులు తెస్తా.. జడ్చర్లను పూర్తిగా అభివృద్ధి చేస్తా..*

• *వరద కాల్వల నిర్మాణానికి అదనపు నిధులు తీసుకొస్తా*

• *రూ.12.5 కోట్లలో పాత బజారుకు ప్రాధాన్యతనిస్తా*

• *మరో రూ.70 కోట్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా*

• *లే అవుట్లలో నిబంధనలకు విరుద్ధంగా గతంలో అనుమతులు*

• *మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయకుండా తప్పించుకున్న రియల్టర్లు*

• *అభివృద్ధి చేయని రియల్టర్లను ప్రజలు నిలదీయాలి*

• *జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి*

జడ్చర్ల, అక్టోబర్ 13: జడ్చర్ల పట్టణంలో వరద నీటి కష్టాలను శాశ్వితంగా తొలగించడానికి అవసరమైన అదనపు నిధులను తీసుకువస్తానని, జడ్చర్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. వరద నీటి కాల్వల నిర్మాణం కోసం ఇది వరకే మంజూరైన రూ.14 కోట్లు కాకుండా, ప్రస్తుతం రోడ్లు, డ్రైన్ల కోసం రూ.12.5 కోట్లు కూడా మంజూరయ్యాయని, ఇవి కాకుండా మరో రూ.70 కోట్లు జడ్చర్ల అభివృద్ధి కోసం తీసుకురావడానికి కృషి చేస్తున్నానని వెల్లడించారు. జడ్చర్ల, బాదేపల్లి, కావేరమ్మపేట ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.



జడ్చర్లలో రూ.14 కోట్లతో చేపడుతున్న వరద కాల్వల (స్ట్రామ్ వాటర్ డ్రైన్స్) నిర్మాణానికి అనిరుధ్ రెడ్డి సోమవారం శంఖుస్థాపన చేసి, నిర్మాణ పనులను ప్రారంభించారు. జడ్చర్ల పట్టణంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురవుతున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగానే ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. పట్టణంలో వరద నీటి కష్టాలను పూర్తిగా తొలగించడానికి, వాన నీళ్లు రోడ్లపై నిలుకుండా చేయడానికి వరద కాల్వల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. దీనికోసం ప్రస్తుతం తీసుకొచ్చిన నిధులు కాకుండా అదనపు నిధులను తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. పట్టణ ప్రగతి లో భాగంగా ప్రస్తుతం మంజూరైన రూ.12.5 కోట్ల నిధులలో రూ.5 కోట్లను జడ్చర్ల పాత బజారు ప్రాంతానికే కేటాయించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కావేరమ్మపేట కూడా తమ సొంత గ్రామమే అని ఆ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్లు కూడా తమ ప్రాంతాలకే నిధులన్నీ ఇవ్వాలని పట్టుబట్టకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని అనిరుధ్ రెడ్డి కోరారు. జడ్చర్ల పట్టణ అభివృద్ది కోసం రూ.70 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఈ నిధులు మంజూరైతే జడ్చర్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంతని అభిప్రాయపడ్డారు. కాగా జడ్చర్ల ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాము వేసిన లే అవుట్లలో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన తర్వాత మాత్రమే మున్సిపాలిటీ మార్టిగేజ్ ను విడుదల చేయాల్సి ఉండగా, ఎలాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకుండానే గతంలో ఉన్న బీఆర్ఎస్ నేతల సహకారంతో మార్టిగేజ్ ను విడిపించుకుపోయారని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. వాళ్లు చేయాల్సిన పనులు అప్పుడు చేయకపోగా ప్రైవేటు లే అవుట్లలో అభివృద్ధి చెందిన నివాసిత ప్రాంతాలను అభివృద్ధి చేసే భారం తమ మీద పడిందని వాపోయారు. ఈ సందర్భంగా కొందరు రియల్ వ్యాపారుల పేర్లను ప్రస్తావిస్తూ తాము చేయాల్సిన పనులు చేయకుండా తప్పించుకుపోయిన రియల్టర్లను నడిరోడ్డున నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛెర్మెన్ కోనేటి పుష్పలత, కమీషనర్ లక్ష్మారెడ్డి, ఇతర కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow