హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు వెలువడ్డాయి. TGPSC గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. TGPSC గ్రూప్-2లో 783 పోస్టులకు గానూ 782 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్సీ చైర్మన్ వెల్లడించారు. అభ్యర్థులు రిజల్ట్స్ కోసం https://www.tspsc.gov.in/ లింక్‌పై క్లిక్ చేయండి
కాగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను 2022లో విడుదల చేయగా, 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరగడంతో ఓఎంఆర్ పత్రాల్లో లోపాలు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి కారణాలతో దాదాపు 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంక్ లిస్ట్ (మార్కులతో సహా)ను మార్చి 11న విడుదల చేసింది.
ఆ తర్వాత మెరిట్‌లిస్ట్ జారీ చేసి, అందులోని వారికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది. ఇక గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వేచి ఉన్న కమిషన్.. శనివారం సీఎం రేవంత్ చేతుల మీదగా గ్రూప్ 1 అభ్యర్ధులకు నియామక పత్రాలు పంపిణీ చేయడంతో.. గ్రూప్ 2 ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది.
