ఆసియా కప్ 2025 (Asia Cup 2025 Final) ఫైనల్ మ్యాచ్ రణరంగం సిద్ధమైంది. శతాబ్దాల శత్రుత్వం, ఉద్విగ్న ఆటతీరు, ఉత్కంఠభరిత క్షణాలతో కూడిన ఈ పోరులో భారత్, పాకిస్తాన్ జట్లు (India vs Pakistan) మునుపెన్నడూ లేనంత ఉత్సాహంతో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పుడు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో మొదటిసారిగా ఈ రెండు దిగ్గజ జట్లు ఫైనల్లో ఆడటం క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ సెప్టెంబర్ 28, 2025న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Dubai International Cricket Stadium)లో రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఉన్న ఈ స్టేడియం 25,000 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. అవసరమైతే 30,000 వరకు విస్తరించవచ్చు. 2009లో ప్రారంభమైన ఈ మైదానం రింగ్ ఆఫ్ ఫైర్ లైటింగ్, గుండ్రని పైకప్పుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గతంలో టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్, ఆసియా కప్, PSL వంటి ప్రముఖ టోర్నమెంట్‌లు జరిగాయి.
హెడ్ టూ హెడ్
ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ ఇప్పటికే రెండుసార్లు తలపడ్డాయి. సెప్టెంబర్ 14న గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ సెట్ చేసిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7 వికెట్ల తేడాతో, 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. సెప్టెంబర్ 21న సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ 171/5 స్కోరు చేసినా, భారత్ 18.5 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) అద్భుతమైన ఆటతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
భారత జట్టులో కెప్టెన్: సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్: శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్లు: సంజు శాంసన్, జితేష్ శర్మ, ఆటగాళ్లు: అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
పాకిస్తాన్ జట్టులో కెప్టెన్: సల్మాన్ అలీ ఆఘా, వికెట్ కీపర్లు: మొహమ్మద్ హారిస్, సాహిబ్‌జాదా ఫర్హాన్, ఆటగాళ్లు: అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, సయీం అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ ఆఫ్రిదీ, సుఫ్యాన్ మొకీమ్ కలరు.