*కమీషన్ల కోసమే ఎమ్మెల్సీ కవిత రోడ్డెక్కింది..*



• కమీషన్లు బయటపడతాయనే బీఆర్ఎస్ ధర్నా చేస్తోంది

• కాళేశ్వరం అవినీతి కుటుంబ పంచాయితీగా మారింది

• సీబీఐ పై బీఆర్ఎస్ నేతల తీరును ప్రజానీకం గమనిస్తోంది

• ధర్నాలు చేయడం కాదు క్లీన్ చిట్ కోసం మోదీ వద్ద పైరవీలు చేసుకోండి

• బీఆర్ఎస్ నేతలతీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ 

జడ్చర్ల, సెప్టెంబర్ 2: తనకు రావాల్సిన కమీషన్లు రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రోడ్డు ఎక్కుతుంటే, సీబీఐ ఎంక్వైరీ జరిగితే తమ నాయకుడు చేసిన తప్పులు బయటపడతాయని బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం అవినీతి పంచాయితీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల ఇంటి పంచాయితీగా మారిందని ఎద్దేవా చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక టీఎంసీ సామర్థ్యం పెంచే పేరుతో ఉన్న నిధులన్నీ అక్కడికే తరలించేసారని, ఇది తప్పని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అప్పుడే ధర్నా చేసి ఉంటే 32 వేల కోట్లతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉండేదని చెప్పారు. 

                                  వైయస్సార్ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించారని ప్రస్తావించారు. అయితే జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని సీబీఐ విచారణకు ఆదేశిస్తే తమ కమీషన్ల భాగోతం బయటపడుతుందని బీఆర్ఎస్ నేతలు సీబీఐ విచారణ వద్దంటూ ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ విషయాలను గురించి బాగా ఆలోచిస్తున్నారని చెప్పారు. కమీషన్ల కోసమే మేము ధర్నా చేస్తామనే రీతిలో బీఆర్ఎస్ నేతల తీరు ఉందని దుయ్యబట్టారు. ఈ కమీషన్ల కోసమే ఎమ్మెల్సీ కవిత ఈరోజున రోడ్డు మీదికి వచ్చిందని వ్యాఖ్యానించారు. కమీషన్లలో కవిత కు కూడా వాటాలివ్వాలని కూడా మీరు ధర్నాలు చేస్తారా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఇంటిలో ఆస్తి పంపకాలు సరిగా జరగకపోతే ఇంట్లోనే కొట్లాడుకుంటారని, అప్పటికీ వాటాలు సరిగా తేలకపోతే ఆ తర్వాత రోడ్డు మీదకు వస్తారని ప్రస్తుతం బీఆర్ఎస్ లో అలాంటి పరిస్థితే ఉందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం అవినీతిలో కవితకు కూడా వాటా వచ్చి ఉంటే ఆమె బయటకు వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. కాళేశ్వరంలో ఖచ్చితంగా తప్పు జరిందన్నారు. ఉమ్మడి పాలమూరు మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు కాకుండా, కాళేశ్వరం కి ఒక టీఎంసీ పెంచారనీ, అప్పుడు మీరు ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. ఆరోజున ధర్నా చేసి ఉంటే కాళేశ్వరానికి ఒక టీఎంసీ పెంచకుండా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు కేవలం 32 వేల కోట్ల నిధులు ఇచ్చి ఉంటే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేదనీ అభిప్రాయపడ్డారు. ఉదండాపూర్ బాధితులంతా రోడ్డు మీదకు వచ్చారని అప్పుడు ధర్నా ఎందుకు చేయలేదని నిలదీసారు. ఉదండాపూర్ నిర్వాసితులు ముఖ్యమంత్రిని కలవాలని వెళ్తుంటే వారిని అరెస్ట్ చేసారని అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని ఇప్పుడు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ పెట్టారని ధర్నా చేయడం సిగ్గు చేటని అనిరుధ్ రెడ్డి దుయ్యబట్టారు. సీబీఐ అనేది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థ అని వారు విచారణ చేసి అవినీతి జరగకుంటే, అవినీతి జరగలేదని నివేదిక ఇస్తారని, అప్పుడు మేము తప్పు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రజల వద్దకు వెళ్లవచ్చునని చెప్పారు. కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాబట్టే సీబీఐ విచారణే వద్దని వారు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను పట్టుకొని మోదీ వద్దకు వెళ్లి తమకు క్లీన్ చిట్ కోసం పైరవీలు చేసుకోండి తప్ప ఇలా రోడ్ల మీదికి వచ్చి కూర్చోవద్దని అనిరుధ్ రెడ్డి హితవు చెప్పారు. కాగా ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా కూడా దివంగతనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను ఇప్పటికీ ఇరు రాష్ట్రాల ప్రజలు గుర్తుంచుకున్నారని కితాబిచ్చారు. వైయస్సార్ కు ఆయన ఘన నివాళులు అర్పించారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow