Samosa: ఛీ.. ఛీ 6 సమోసాలకు లంచం – బాలికపై అత్యాచారం కేసును నీరుగార్చిన పోలీసులు



బాలికపై అత్యాచారం జరిగితే ఎవ్వరైనా కన్నెర్ర చేస్తారు. బాధ్యుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తారు. నిజానికి సమాజం కోరుకునేది కూడా అదే. కానీ ఈ ఖాకీలు ఉన్నారే.. కక్కుర్తికి అలవాటుపడి ఏకంగా కేసును తప్పుదోవ పట్టించారు. కేసు పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి.. 2019, ఏప్రిల్ 1… 14ఏళ్ల బాలిక స్కూల్‌కి వెళ్లింది.. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.. న్యాయం చేయాల్సిన పోలీసులు.. సమోసాలకి అమ్ముడుపోయారు.. కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్‌ ఎటా జిల్లాలో జరిగిన ఈ దారుణం.. ఖాకీవనంలో గంజాయి మొక్కల నిర్వాకాన్ని ఎండగట్టింది.

వీరేష్‌.. సమోసాలు విక్రయించే వ్యాపారి. బాలికను గొధుమ పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడి చేస్తుండగా.. అరుపులు కేకలు వేసింది. గమనించిన గ్రామస్తులు అటుగా వెళ్లారు. వారిని చూసి కులం పేరుతో దూషించాడు వీరేష్‌. చంపుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జరిగిన విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాధితురాలి వాంగ్మూలం తీసుకోకుండా రిపోర్ట్

వీరేష్‌ దగ్గర ఆరు సమోసాలను లంచంగా తీసుకుని పోలీసులు మోసానికి ఒడిగట్టారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితురాలి వాంగ్మూలం తీసుకోకుండా తప్పుడు రిపోర్ట్‌ తయారుచేశారు. బాలిక అప్పుగా సమోసాలు అడిగిందని.. వీరేష్‌ నిరాకరించడంతో తప్పుడు కేసు పెట్టిందని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. దీనికి ప్రతిగా 2025 జూన్ 27న బాలిక తండ్రి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది.

‘నిందితుడు సమోసాల దుకాణాన్ని నడుపుతున్నాడు. అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడి దగ్గర 6 సమోసాలను లంచంగా తీసుకుని, బాలిక పైనే ఉల్టా కేసు నమోదు చేశారు’ అని బాధితుల లాయర్ తెలిపారు.

నేరుగా తామే విచారణ చేయాలని కోర్ట్ నిర్ణయం

పోలీసుల ఫైనల్ రిపోర్ట్‌ను స్పెషల్ పోక్సో కోర్ట్‌ తిరస్కరించింది. పోలీసుల ప్రభావం లేకుండా నేరుగా తామే విచారణ చేయాలని కోర్టు నిర్ణయించింది. పోలీసులు సమోసాలకు ఆశపడి కేసును తప్పుదోవ పట్టించడం విమర్శలకు దారితీసింది. అలాంటి ఖాకీలు ఉన్నంతకాలం తమలాంటి పేదలకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేసింది బాధిత కుటుంబం.

Previous Post Next Post

نموذج الاتصال