ఉద్యోగం లో చేరిన రెండు నెలలకే ఘోరం.. సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో చాగల్లు యువతి మృతి*

 *


పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడులో యువతి మృతి

మృతురాలు తూర్పుగోదావరి జిల్లా చాగల్లు వాసి ప్రసన్న (22)

రెండు నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన యువతి

త్వరలో పెళ్లి జరిపించేందుకు తల్లిదండ్రుల ఏర్పాట్లు

ప్రమాదంతో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు

ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడాలనుకున్న ఆ యువతి ఆశలు ఆవిరయ్యాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆమెను విధి చిన్నచూపు చూసింది. పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతిని బలిగొంది. ఈ ఘటనతో ఆమె స్వగ్రామమైన చాగల్లులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. చాగల్లుకు చెందిన శ్రీనివాసరావు, రామలక్ష్మి దంపతుల కుమార్తె పోలిశెట్టి ప్రసన్న (22) తండ్రి శ్రీనివాసరావు తాపీమేస్త్రీగా పనిచేస్తూనే, మదర్‌థెరిసా సేవా సమితి ద్వారా సామాజిక సేవ చేస్తుంటారు. వీరికి ప్రసన్న, ప్రభుకుమారి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన ప్రసన్నకు పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్న ఆమె మేనల్లుడు యాతం జయమహేశ్‌ సహాయంతో రెండు నెలల క్రితమే అదే కంపెనీలో ఉద్యోగం లభించింది.


ఉద్యోగంలో చేరడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. ఈ క్రమంలోనే సమీప బంధువుతో ఆమె వివాహం నిశ్చయించి, త్వరలోనే పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే విధి వక్రీకరించింది. సోమవారం పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదంలో ప్రసన్న తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత భవిష్యత్తు ఉంటుందనుకున్న తమ కుమార్తె ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో చాగల్లు గ్రామం శోక‌సంద్రంలో మునిగిపోయింది.

Previous Post Next Post

نموذج الاتصال