పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడివేడి చర్చలకు సమయం ఆసన్నమైంది.. మొదటి వారం విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వం కొనసాగగా..శుక్రవారం స్పీకర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తో అధికార విపక్షాల మధ్య చర్చల విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది..మొదటగా లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడిపై 16 గంటల పాటు చర్చ జరగనుంది. భారత దేశ చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ గా ఆపరేషన్ సిందూర్ జరిగిందంటున్న కేంద్రం ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు సందేహాలపై దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వనుంది.. కేవలం దేశ ప్రజలకే కాక దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ ద్వారా ఉగ్రవాదంపై భారత వైఖరి మరోసారి ప్రపంచానికి చాటి చెప్పనుంది.
ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను మతం పేరున వారి భార్యల ఎదుటే వారి భర్తలను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీ గురిపెట్టి.. మోడీకి వెళ్ళి చెప్పండి అన్న ఉగ్రవాదుల వ్యాఖ్యలకు సమాధానంగా నుదుటన బొట్టు చెరిపేసిన ఉగ్రవాదులకు అదే సిందూర్‌తో న్యాయం చేయాలని చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి పార్లమెంట్లో చర్చ జరగనుంది.. మే 7 న మొదలై మే 10 వరకు పాకిస్తాన్ పై కొనసాగిన సైనిక చర్య..ఉగ్రవాదంపై భారత పోరు.. పాకిస్తాన్ పై ఆంక్షలు.. ఆపరేషన్ సింధూర్ ద్వారా చేపట్టిన సైనిక చర్యల ద్వారా పాకిస్తాన్, పాక్ అక్రమత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలకు జరిగిన నష్టం.. తదుపరి పాకిస్తాన్ సైనిక చర్యలకు సమాధానంగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ , పాక్ రక్షణ స్థావరాలు.. సరిహద్దుల్లో పాక్ సైనిక పోస్టుల ధ్వంసం. గగన తలం ద్వారా భారత్ పై పాకిస్తాన్ జరిపిన దాడులు.. ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా పాక్ డ్రోన్ దాడులు మిస్సైల్ దాడులను ఏ విధంగా ఎదుర్కొన్నది.. తదుపరి కాల్పులు విరమణ ఒప్పందం ఎలా జరిగింది.. అమెరికా అధ్యక్షుడు ప్రకటన సారాంశం.. తదుపరి భారత ఎంపీల విదేశీ పర్యటనలు వీటన్నింటినీ పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు కేంద్రం వివరించనుంది.
ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభించనున్న రక్షణమంత్రి
కేంద్రం ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభించనున్నారు. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బిజెపి ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే పాల్గొననున్నారు..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్చలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది..ఇక జూలై 29వ తేదీ మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరగనుంది రాజ్యసభలో చర్చ లో పాల్గొననున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇతర మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది ఉభయ సభల్లో ఈ అంశంపై 16 గంటల పాటు జరగనున్న చర్చలు జరగనున్నాయి. కీలక రాజకీయ పార్టీల నుంచి ఎంపీలు పహల్గామ్ ఉగ్రదాడి,ఆపరేషన్ సిందూర్ గురించిన అంశాలపై మాట్లాడనున్నారు.
మోదీ సమాధానంపై విపక్షాల డిమాండ్.
రెండు సభల్లో ఆపరేషన్ సిందూర్ పై విపక్షాల లేవనెత్తే అంశాలకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా ఉంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి..భద్రతా వైఫల్యాలు?.. మూడు నెలలు అవుతున్న ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోలేకపోవడం..? పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తామని ముందస్తుగానే పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వడం..? ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనాతో ఘర్షణలు జరిగాయా..? యుద్ధాన్ని తానే ఆపానని 26 సార్లు ట్రంప్ మాట్లాడటం..? అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు నిలిపివేస్తానని ట్రంప్ బెదిరించడం? ఆపరేషన్ సింధూర్‌లో భారత వాయుసేనకు జరిగిన నష్టం ఎంత ? దేశభద్రత దేశ విదేశాంగ విధానం పై ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. ఆపరేషన్ సిందూర్ పై తమ ప్రశ్నలకు ప్రధాని మాత్రమే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.
ఆపరేషన్ సిందూర్ పై చర్చ రాహుల్ గాంధీ విజయం అంటున్న కాంగ్రెస్
ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ,తదుపరి ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ రెండు నెలలుగా డిమాండ్ చేస్తుండగా ఎట్టకేలకు కేంద్రం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చకు అంగీకరించడం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి విజయంగా కాంగ్రెస్ పేర్కొంది. సోమవారం ప్రారంభమయ్యే చర్చకు లోక్‌సభ స్పీకర్ 16 గంటలు కేటాయించారు. ఇందులో కాంగ్రెస్ 100 మందికి పైగా ఎంపీలతో సభలో అతిపెద్ద పార్టీగా ఉన్నందున దాదాపు మూడు గంటలు సమయం కేటాయించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి-ఆపరేషన్ సిందూర్ చర్చ సందర్భంగా అనేక మంది ఎంపీలు మాట్లాడాలని కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ , ఎల్ఓపీ నిర్ణయం ప్రకారం చర్చలో పాల్గొనే ఎంపీల పేర్లను షార్ట్‌లిస్ట్ కానుంది. ఇప్పటికే రానున్న మూడు రోజులపాటు ఎంపీలు తప్పని సరిగా ఉభయ సభలకు హాజరుకావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. లోక్ సభలో ఎల్ఓపీ రాహుల్ గాంధీ చర్చకు నాయకత్వం వహిస్తారు. రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే చర్చకు నాయకత్వం వహిస్తారు.
బీహార్ SIR పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్
ఆపరేషన్ సిందూర్ పై చర్చ తరహాలోనే తదుపరి బీహార్ SIR పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్ చేయనుంది.. బీహార్ SIR అంశం తమకు చాలా ముఖ్యమైనదనీ ఇది దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించినదనీ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ద్వారా ఓట్లను తొలగిస్తున్నారని ఇండియా కూటమి ఆరోపిస్తోంది.. దీనిపై కేంద్రం,ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంది .సోమవారం 28న లోక్‌సభ ప్రారంభమయ్యే ముందు INDIA బ్లాక్ పార్టీలు పహల్గామ్ ఆపరేషన్ సిందూర్‌తో పాటు బీహార్ SIR అంశంపై ప్రతిపక్ష వ్యూహాన్ని సమీక్షిస్తాయి. చర్చల సమయంలో ప్రధాని మోడీ సభలో ఉండాలని ..విపక్షాల ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వాలని కూడా బ్లాక్ డిమాండ్ చేస్తుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక భద్రతా లోపాన్ని ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో అంగీకరించిందని కాంగ్రెస్ చెబుతుంది..ఆ లోపానికి ఎవరు బాధ్యులు ఈ విషయంలో ఏ చర్యలు తీసుకున్నారు. ఇంకా, ప్రమాదంలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు..? వారు ఎప్పుడు శిక్షించబడతారు… ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దేశానికిజరిగిన నష్టాలకు సంబంధించి విభిన్న వాదనలు వచ్చాయి ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.
ప్రభుత్వ వైఖరికి మద్దతుగా నిలవనున్న ఎన్డీఏ పక్షాలు
ఆపరేషన్ సిందూర్ , పహల్గామ్ గురజాడ పై చర్చ సందర్భంగా విపక్షాలు లేవనెత్తే అంశాలు.. ప్రభుత్వంపై విమర్శలను తిప్పికొట్టే విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఆపరేషన్ సిందూర్ చర్చల్లో పాల్గొననున్నాయి. ఆపరేషన్ సింధూర కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత 7 అఖిలపక్ష బృందాలు 33 దేశాలలో పర్యటించాయి. పాక్ ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించాయి. సుమారు 10 రోజుల పాటు ఏడు అఖిలపక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటించి ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు వివరించాయి. 33 దేశాల్లో 15 దేశాలు ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాలుగా వ్యవహరిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో శాంతిభద్రతలు, ఉగ్రవాదం, ఆర్థిక ఆంక్షలు వంటి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీసుకుంటుంది. ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు, తీర్మానాలలో భద్రతా మండలిలోని దేశాలే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆయా దేశాలకు తన వైఖరిని తెలియజేయడానికి భారత్ ప్రయారిటీ ఇచ్చింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. మిగతా 10 దేశాల తాత్కాలిక సభ్యత్వం రెండేళ్లకోసారి రొటేషన్ అవుతుంటుంది. భారత్‌తో బలమైన వాణిజ్య, స్నేహ సంబంధాలు కలిగిన దేశాలను కూడా అఖిలపక్ష బృందాల పర్యటన కోసం ఎంపిక చేశారు. ఈ జాబితాలో సౌదీ అరేబియా, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, యూఏఈ, బ్రెజిల్, ఈజిప్ట్, ఖతర్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఉన్నాయి. పనామా, గయానా, కొలంబియా, లాత్వియా, స్లొవేనియా లాంటి చిన్న దేశాలలోనూ భారత ఆల్ పార్టీ టీమ్‌లు పర్యటించాయి. ఎందుకంటే ఆయా దేశాలతో భారత్‌కు మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. విదేశాల్లో పర్యటించిన అఖిలపక్ష బృందంలో విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఉన్నప్పటికీ బిజెపి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యుల అధికంగా ఉన్నారు. వీరందరూ పార్లమెంట్లో జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.
మొత్తంగా పార్లమెంటు ఉభయ సభల్లో పహల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్ సిందూర్ పై జరిగే చర్చ ద్వారా దేశ ప్రజలకు ప్రపంచానికి మరోసారి ఉగ్రవాదంపై భారత వైఖరి.. దేశ భద్రత.. దేశ సైనిక సన్నద్ధత.. భారతదేశాంగ విధానం అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి వివిధ దేశాల మద్దతు.. ట్రంప్ వ్యాఖ్యల సారాంశం అన్నిటి పైనా ఒక స్పష్టత రానుంది.