High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. పిటీషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Hyderabad: తెలంగాణలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై (Sarpanch Elections) హైకోర్టు (High Court) కీలక తీర్పు (Verdict) ఇచ్చింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 రోజులు (90 Days) సమయం కావాలని ప్రభుత్వం కోరింది.. ఎలక్షన్ కమిషన్ (Election Commission) 60 రోజుల సమయం కోరింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ మాధవి బెంచ్ ధర్మాసనం మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై నల్గొండ జిల్లా సర్పంచులు పిటిషన్లు వేశారు.
ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారో చెప్పాలి..
కాగా స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆరు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటీషనర్లను ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం నిలదీసింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తి అవ్వలేదని కొంత సమయం కావాలని కోర్టుని ప్రభుత్వం కోరింది.
న్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించాలని పిటీషనర్లు వాదనలు వినిపించారు. ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని.. కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటీషనర్లు వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పిటీషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పు బుధవారం నాటికి రిజర్వ్ చేసింది. ఈరోజు హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కాగా 2024 ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.
పిటిషనర్ తరుపు న్యాయవాది...
స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్ తరుపు న్యాయవాది నరేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా న్యాయవాది నరేష్ రెడ్డి మాట్లాడారు..హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, రిజర్వేషన్లు ఫైనలైజ్ చేయడం కోసం 30 రోజులు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. ఎన్నికల నిర్వహణకు 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై న్యాయ స్థానంలో వాదనలు వినిపించామన్నారు. రాజ్యాంగంలోని 243ఈ, 243కే ఆర్టికల్స్ ప్రకారం తెలంగాణా పంచాయతీ రాజ్ చట్టం 2018ను ఉల్లగించారని వాదనలు వినిపించామని, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఫైనలైజ్ చేసేందుకు ప్రభుత్వం సమయం కోరిందన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలు పూర్తి చేస్తుందని భావిస్తున్నామని న్యాయవాది నరేష్ రెడ్డి అన్నారు.