Twists in TG Politics: తెలంగాణలో మారుతున్న రాజకీయం.. కలిసొచ్చేదెవరికి


 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో మారబోతున్నాయా అనే చర్చ మొదలైంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ ఓడి, బీజేపీ గెలవడంతో ఇక తెలంగాణలో రానున్నది తమ ప్రభుత్వమేనంటూ కమలం నేతలు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వంపై తక్కువకాలంలోనే ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ ప్రచార చేస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో బీజేపీ గెలుపొందిందని, రెండు పార్టీలు కలిసి తమపై కుట్ర చేసినా తమకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.


మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండుచోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పోటీచేసిన ఒక స్థానంలో కాంగ్రెస్ పరాజయం చవిచూసింది. ఓవైపు బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస‌ను నమ్మడం లేదని, రానున్న రోజుల్లో తామే ప్రత్యామ్నాయం అంటూ కమలం నేతలు చెప్పుకొస్తున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ద్వారా బీజేపీ బలపడిందా.. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయా.. మార్పులు వస్తే భవిష్యత్తులో ఏ రాజకీయపార్టీకి కలిసొస్తుందనే చర్చ జరుగుతోంది.


గెలుపుతో ఉత్సాహం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ శ్రేణులు మంచి ఉత్సాహంతో ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఊపుతో పనిచేసేందుకు హైకమాండ్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు తాము మాత్రమే ప్రత్యామ్నాయమనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేలనే పక్కా ప్లాన్‌తో బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారు. అయితే ఇది బీజేపీకి అంత ఈజీ కాదనే అభిప్రాయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటు జీహెచ్‌ఎంసీలో సత్తా చాటిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి చతకిలపడింది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో బీజేపీ రన్నింగ్ రేసులో వెనక్కి వెళ్లిపోయిదనే ప్రచారం జరిగింది. దీంతో2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 8 శాసనసభస్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని, 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం బీజేపీకి ప్లస్ పాయింట్‌గానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో గతంతో పోలిస్తే బీఆర్‌ఎస్ బలం కొంతమేరకు తగ్గిందనే చర్చ సాగుతోంది. బీజేపీ బలపడుతున్నప్పటికీ రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ను ఓడించే స్థాయిలో ఆ పార్టీ బలం పెంచుకోగలదా.. లేకుంటే బీఆర్‌ఎస్ తన బలాన్ని పెంచుకుని కాంగ్రెస్‌కు సవాల్ విసురుతుందా అనేది వేచి చూడాలి.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో

పట్టభద్రుల స్థానంలో బీజేపీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయనకు మెదక్ మినహా మిగతా మూడు జిల్లాల ప్రజలతో చెప్పుకోదగ్గ అనుబంధం లేదు. ఆయన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అంతగా తెలియదు. కానీ బీజేపీ క్షేత్రస్థాయిలో పని విధానం, నాయకుల మధ్య సమ్వయంతో ఈ సీటును గెలుచుకోగలిగింది. అభ్యర్థికంటే పార్టీని గెలిపించుకోవాలనే ప్రణాళికతో కమలం నేతలు ముందుకు వెళ్లారు.దీంతో యువతను బీజేపీ ఆకర్షించగలిగింది. మరోవైప బీఆర్‌ఎస్ పోటీలో లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న యువత బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుసతోంది. ఈ పరిణామాలన్ని రానున్న రోజుల్లో బీజేపీకి ఎక్కువుగా కలిసిరావొచ్చనే చర్చ జరుగుతోంది.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me