తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 10న జరిగిన ఇంటర్‌మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో ప్రింటింగ్ మిస్టేక్స్ వల్ల అక్షరాలు కనిపించక రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లోని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఇంటర్ బోర్డు దిగొచ్చింది. ఇంగ్లిష్ పరీక్షలో 7వ ప్రశ్నకు మార్కులు కలుపుతామని ఇంటర్‌బోర్డు తాజాగా ప్రకటించింది. 4 మార్కుల 7వ ప్రశ్నకు ముద్రణ లోపం వల్ల సరిగా కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారని, పైచార్టులో ఇచ్చిన శాతాలు స్పష్టంగా ఉన్నా.. వాటిని వివరిస్తూ పక్కన చిన్నబాక్సుల్లో ఇచ్చిన చుక్కలు, గీతలు సరిగా కనిపించలేదు. దీంతో అనేక పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని చోట్ల ఇంటర్‌బోర్డు నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, తెలిసిన మేరకు విద్యార్ధులను జవాబులు రాయాలని ఇన్విజిలేటర్లు చెప్పారు. జడ్చర్ల తదితర చోట్ల చీఫ్ సూపరింటెండెంట్లకు పరీక్ష రాసిన కొందరు విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సబ్జెక్టు నిపుణులతో చర్చించిన బోర్డు ఆ ప్రశ్నకు సమాధానం రాసేందుకు అటెంప్ట్ చేసిన వారందరికీ 4 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటన జారీ చేశారు. మార్చి 10న జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,33,963 మంది హాజరుకాగా.. 13,029 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 24 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 25 వరకు జరగనున్న సంగతి తెలిసిందే
Tags
Intermediate