Telangana: రేషన్ కార్డులపై ప్రధాని మోదీ బొమ్మ ఉండాల్సిందే.. టీ-బీజేపీ డిమాండ్
తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త కార్డుల జారీకి పలు నమూనాలను సైతం సీఎం రేవంత్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో మరోసారి రేషన్ కార్డులపై ప్రధాని మోదీ బొమ్మ పెట్టాలనే డిమాండ్‌ను తెలంగాణ బీజేపీ నేతలు బలంగా వినిపిస్తున్నారు.
తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త కార్డుల జారీకి పలు నమూనాలను సైతం సీఎం రేవంత్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో మరోసారి రేషన్ కార్డులపై ప్రధాని మోదీ బొమ్మ పెట్టాలనే డిమాండ్‌ను తెలంగాణ బీజేపీ నేతలు బలంగా వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఉచితంగా రేషన్ అందిస్తోందని.. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ అధినేత అయిన మోడీ బొమ్మ పెట్టాడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంటని పాలమూరు ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. బరాబర్ రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని.. గత ఎన్నికల హామీల్లో భాగంగా మరో ఐదేళ్లు దేశంలో నిరుపేదలకు ఉచిత రేషన్ బియ్యం కేంద్ర సర్కారు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి వాటా లేదని స్పష్టం చేశారు. గతంలో మార్కెట్లో 35 రూపాయల విలువైన బియ్యాన్ని కేంద్రం వాటా 29 రూపాయలు.. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, లబ్ధిదారుని వాటా రూపాయి చొప్పున విభజించేవారు. అలా రూపాయికి కిలో రేషన్ బియ్యం అందేవి. కానీ కరోనా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం అందించాలన్న సంకల్పంతో ఫ్రీగా పంపిణీ చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా లేదని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ కేంద్రం నిధులు ఇస్తే వీళ్లు పేర్లు పెట్టుకుంటున్నారని.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ పేరు మీదనే పేదలకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
కులగణనలో పాల్గొనేది లేదు -డీకే అరుణ
రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం చేపట్టిన కుటుంబ సర్వేలో పాల్గొనలేదని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉన్న తన కుటుంబ వివరాలు , కులం అందరికీ తెలిసిందేనని దానికి సర్వే ఎందుకు అన్నారు. ఇంట్లోని సభ్యుల వివరాలు, కులం వరకు సరిగా ఉన్నా ఏ పార్టీ, ఎన్ని ఆస్తులు ఉన్నాయన్న ప్రత్యేక వివరాలు దేనికని అరుణ ప్రశ్నించారు. తన ఆస్తుల అఫిడవిట్ ఎన్నికల కమిషన్ పబ్లిక్ డొమైన్ లో ఉంచిందని స్పష్టం చేశారు. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సామాజిక బహిష్కరణ చేయడానికి ఆయన ఎవరు.. ఆయనకు ఉన్న అర్హత ఎంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని రాష్ట్ర బహిష్కరణ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ అరుణ మండిపడ్డారు
Tags
bjp news