Deputy CM Bhatti: రేవంత్ కేబినెట్ విస్తరణ ఎంత వరకు వచ్చింది? ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు లాబీయింగ్ మొదలుపెట్టారా? అధిష్టానం ఎటు వైపు మొగ్గు చూపుతోంది? కొత్త వారికి ఛాన్స్ ఇస్తుందా? లేక పాత వారిని మళ్లీ తీసుకుంటున్నారా? ఇదే చర్చ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. చివరకు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెండురోజుల టూర్‌లో భాగంగా గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏఐసీసీ పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం, ఇన్‌ఛార్జ్ మున్షీ భేటీ కానున్నారు. మంత్రివర్గం విస్తరణలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలా? లేక పాతవారికే పట్టం కట్టాలా అనేదానిపై హైకమాండ్ నుంచి క్లారిటీ తీసుకోనున్నారు. అటు కేబినెట్ విస్తరణపై అగ్రనేతలతో చర్చించే అవకాశం లేకపోలేదు.
దీనిపై గతరాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్‌కు అందజేశామన్నారు. సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సబ్ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ అనంతరం కేబినెట్‌లో ఆమోదించడం జరిగిందని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న అంశాలు ఇవేనని తెలిపారు. వాటిపై భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, దాని గురించి అధిష్టానం పెద్దలతో చర్చించడం కోసం ఢిల్లీకి వచ్చినట్టు మనసులోని మాట బయటపెట్టారు. గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. ఈ సందర్భంగా కులగణన జరిగిన తీరును సీఎం రేవంత్ వివరించారు. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పినట్టు సమాచారం. పార్టీ కార్యవర్గాన్ని నియామకం గురించి చర్చ జరిగింది. కార్యవర్గం, ఆఫీసు బేరర్లు, ఎవరెవరిని నియమించాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్టు కాంగ్రెస్ వర్గాల మాట. స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దశలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించినట్టు ఢిల్లీ సమాచారం. శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత కేబినెట్ లోకి ఎవర్ని తీసుకుంటారనే దానిపై క్లారిటీ రానుంది. మరోవైపు ఈ వారంలో పీసీసీ కార్యవర్గాన్ని హైకమాండ్ ప్రకటిస్తుందన్నది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ మాట. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యిందని, ఈ నేపథ్యంలో అధిష్టానం పెద్దలు తెలంగాణకు రావాల్సిందిగా ఆహ్వానించేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు టీపీసీసీ చీఫ్. ఈ రెండు అంశాలపై భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీనిపై హైకమాండ్ మాట్లాడుతామన్నారు. త్వరలో అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని మనసులోని మాట బయటపెట్టారు. ఈ విషయమై శుక్రవారం రాహుల్, మల్లికార్జున ఖర్గేలతో కలిసి మాట్లాడుతామన్నారు.