MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలైనా బీఆర్ఎస్‌లో చడీ చప్పుడూ కనిపించడం లేదు.. ఎంపీ ఎన్నికల రిజల్ట్స్ రిపీట్ అయితే ఉన్న కాస్త పరువు పోతుందని ఆ పార్టీ పెద్దలు భయపడుతున్నారా? అందుకే పోటీకి దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు పంపుతుందా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఆశావహులు కొందరు ముందుకు వస్తున్నా వారికి సానుకూల సంకేతాలు అందుకే రావడం లేదా? ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీ గ్రాఫ్ మరింత తగ్గిపోతుందని పోటీకి సంశయిస్తుందా?
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి . రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో , ఒక పట్ట భద్రుల స్థానానికి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందా? లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది చర్చగా మారింది. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది. ఇంతకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి అనేది రాజకీయ వర్గాలకు అంతుపట్టకుండా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోవడంతో పాటు ఏకంగా సగం స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో గులాబీ కేడర్ పూర్తిగా ఢీలా పడిపోయింది.ఆ తర్వాత జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. అందుకే త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధులను నిలబెట్టేందుకు పార్టీ పెద్దలు సంకోచిస్తున్నారంట. నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్ధిని నిలబెట్టలేదు. అప్పట్లో వేరే అభ్యర్ధికి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ టికెట్ కోసం నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిలుముల రాకేష్ కుమార్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రయివేటు విద్యాసంస్థల సంఘం నేత శేఖర్‌రావు టిక్కెట్ ఆశిస్తున్నారు. వారు కేసీఆర్ ను కలిసి తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని ఇప్పటికే కోరారు. ఇక కరీంనగర్, నిజామాబాద్ , మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పాతూరి సుధాకర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అధికారంలో ఉన్నప్పుడే ఓడిపోయిన ఆ స్థానం నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్ధి రంగంలోకి దిగడం అనమానమే అంటున్నారు. ఖమ్మం, వరంగల్ , నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో పిఆర్‌టియూ నుండి గెలిచిన పూల రవీందర్ బీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి పోటీ చేసిన పూల రవీందర్ పరాజయం పాలయ్యారు. దాంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను నిలబెడుతుందా లేదా అన్నది క్లారిటీ లేకుండా పోయింది. ఎన్నికల్లో పోటీపై గులాబీ పార్టీ ముఖ్య నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థులపై కసరత్తులు చేస్తోంది. మెదక్ , కరీంనగర్ , నిజామాబాద్ , ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిని ప్రకటించింది .. ఇక కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కవిత ఎమ్మెల్సీగా అక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఈ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ సంశయిస్తుండటం ఆ పార్టీ దైన్య స్థితికి అద్దం పడుతోందంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని బీఆర్ఎస్ ఉదరగొడుతుంది. అయినా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో.. కేసీఆర్ వ్యవహా శైలిలో ఇంక మర్పురాలేదని, అదే ఒంటెద్దు పోకడ పోతున్నారని గులాబీ శ్రేణులు గుర్రుగా కనిపిస్తున్నాయి.
Tags
BRS