: కరీంనగర్‌లో పోలీస్ వర్సెస్ రెవెన్యూ వార్ నడుస్తోంది. రెవెన్యూ అధికారులు మాత్రం తగ్గేదేలే అని అంటున్నారు. కరీంనగర్‌లో నువ్వా నేనా అనే విధంగా రెవెన్యూ, పోలీస్ విభాగాల మధ్య వివాదం ముదురుతోంది. ఏమి చేయాలో తోచక పోలీసులు మల్లాగుల్లాలు పడుతున్నారు. దీనికి కారణం కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పర్యటనే అనే తెలుస్తోంది. మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పర్యటించారు. ఈ పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అయితే మంత్రులను పోలీసులు పదే పదే తోసేశారు. దీంతో మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ పర్యటనలో జరిగిన ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమొలు జారీ చేసి వివరణ కోరారు. ఈ విషయంపై కలెక్టర్ త్వరాత వివరణ కూడా ఇచ్చారు. కానీ ఈ వివాదం అంతటితో సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. తాజాగా మరోసారి ఈ వివాదంలో పోలీసులు వర్సెస్ రెవెన్యూ అధికారులు అన్న చందంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం రాజుకుంది.
కరీంనగర్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు రెవెన్యూ శాఖ అడ్డుపుల్ల వేసినట్లు తెలుస్తోంది. రేపు జరగాల్సిన స్పోర్ట్స్ మీట్‌కు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఆటంకాలు కల్పిస్తోంది. అంబేద్కర్ స్టేడియం తలుపులకు తాళాలు, గెస్ట్‌హౌస్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. రేపు ఉదయం అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. రెవెన్యూ అధికారుల తీరుతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కరీంనగర్ పోలీసులు ఉన్నారు. రెవెన్యూ శాఖతో వివాదంతో పోలీసుశాఖకు అన్ని విభాగాలు సహాయ నిరాకరణ చేపట్టాయి. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ రెండు శాఖల మధ్య ఉన్నతస్థాయి అధికారులు కల్పించుకుని సద్దుమణిగేలా చేయాల్సి ఉంది.