KCR: తులం బంగారానికి ఆశపడి ఓటేశారు.. జనాలను కించపరిస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు..?KCR: మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ మాట్లాడారు. రాబోయే రోజుల్లో విజయం మనదే అని.. మనం విజయం తెలంగాణ విజయం కావాలని.. ఆయన అన్నారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని కేసీఆర్ అన్నారు. ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు ఇక లాభం లేదు. ప్రత్యక్ష పోరాటాలే చేద్దాం. కాంగ్రెస్ పరిపాలనలో రైతుబంధుకు రామ్ రామ్ చెప్పేశారు. దళిత బందుకు జై భీమ్ చెప్పేశారు. తులం బంగారం ఏమైంది..? కాంగ్రెస్ పాలనపై రాష్ట్రమంతటా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అన్ని వర్గాలను ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కరెంటు కోతలు కనబడుతున్నాయి. తులం బంగారం కోసం ఆశపడి ఓటేశారు. ఇప్పుడేమో ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దాం’ అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
త్వరలోనే భారీ సభ పెట్టుకుందామని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ దివాలా తీయించిందని విమర్శించారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని అన్నారు. మాట్లాడితే ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ అంటున్నారు.. అసలు ఫాంహౌస్‌లో పంటల తప్ప ఏం పండుతాయి అని ప్రశ్నించారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే వారి పార్టీకే వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలివీస్తుందని.. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేను ఎంత చెప్పినా ప్రజలు వినలేదు. అత్యాశ పడి కాంగ్రెస్ వాళ్లకు ఓటేశారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. తెలంగాణలో ఉన్న ప్రతి బడ్డ మనోడే.. అన్ని మబ్బుల తొలిగిపోయి ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి. మంచేదో.. చెడు ఏదో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కాంగ్రెస్ పాలనపై అంతటా అసంతృప్తే ఉంది’ అని కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు. అన్ని పథకాలు గంగలో కలిసిపోయాయి. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన కూడా నేను రైతు బంధు ఆపలేదు. రైతు భీమా వల్ల ఎంతోమంది రైతులకు సహాయం జరిగింది. కైలాసం ఆడంగా పెద్ద పాము మింగినట్లు అయ్యింది తెలంగాణ ప్రజల పని. మళ్ళీ కరెంట్ కోతలు.. మంచి నీళ్ల కరువు వచ్చాయి..ఇది ఏంది అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. ఆలోచన లేకుండా ఎవరో ఏదో చెబితే నమ్మి ఓట్లు వేస్తే ఏమైతదో తెలంగాణ ప్రజలకు మంచి గుణపాఠం అయ్యింది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
గురుకులాల్లో అన్ని సమస్యలే.. ఎన్నో ఇబ్బందులు పడుతూ విద్యార్థులు హస్టల్ వసతుల నుంచి వెళ్లిపోతున్నారు. పిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం టెండర్లు ఎందుకు పిలవరు. వాటిని అడ్డుకోవడంలో మతలాబు ఏంటి.. సంగమేశ్వర,బసవేశ్వర ఎత్తిపోతల పథకం గురించి హరీష్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న రైతులతో నిరసన కార్యక్రమం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ముస్లింలను వాడుకుంది కానీ వారికి ఏమి చేయలేదు’ అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు కేసీఆర్ చాలారోజుల తర్వాత బయటకొచ్చి మాట్లాడారు.