Drunk and Drive Test: న్యూ ఇయర్‌ అలర్ట్‌.. 4 గంటల నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌

jayyapal jvs media
1 minute read


 Drunk and Drive Test: న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు నగర వాసులు రెడీ అయ్యారు. యువతను ఆకట్టుకునేందుకు పబ్‌లు, ఈవేంట్‌ ఆర్గనైజర్లు.. వివిధ ఆఫర్లతో తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో నాలుగు పబ్బులకు అనుమతి నిరాకరించారు. హాట్‌ కప్‌, అమ్నేషియా, బ్రాండ్‌ వే, బేబీ లాండ్‌ పబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలకు పర్మిషన్‌ రద్దుచేశారు.


ఈసారి గతం కంటే ఎక్కువ ఈవెంట్లను ప్లాన్ చేశారు ఆర్గనైజర్లు. పోలీస్ నిబంధనల ప్రకారం భారీగా ఈవెంట్లు జరగనున్నాయి. ఈవెంట్లలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా.. సేవించినా నిర్వాహకులదే బాధ్యత అని పోలీసుల ఇప్పటికే ప్రకటించారు.

సైబరాబాద్‌లో రెండు వందలకు పైగా ఈవెంట్లు జరుగుతున్నట్లు పోలీసులు ప్రకటించారు. వాటికోసం ప్రముఖ డీజేలను రప్పించారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్‌లోని పబ్స్, బార్స్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వందకు పైగా పోలీస్ టీంలు ఏర్పాటు చేసి.. ఈవెంట్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం వరకు సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు.


ఇక మద్యం తాగి తొలిసారి పట్టుబడితే.. రూ.10,000 జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష విధించనున్నారు. రెండో సారి పట్టుబడితే.. రూ,15,000 జరిమానతో పాటు, మూడు నెలలు జైలు శిక్ష.. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. డ్రగ్స్ తీసుకుని వాహనం నడిపితే.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. కాబట్టి మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి. ఇదిలా ఉంటే.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫ్లై ఓవర్లు మూసేస్తున్నట్లు ప్రకటించారు. రాత్రి 10గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతిచ్చారు. బార్లు, పబ్బులకు అర్థరాత్రి ఒంటిగంట దాకా నడిపించుకోవచ్చని ప్రకటించారు.

మరోవైపు న్యూఇయర్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాలు పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి 12: 30 గంటలకు వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. న్యూఇయర్ వేడులు జరుపుకొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్‌ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దీని బట్టి మరిన్ని మెట్రో రైళ్లను నడపున్నట్లు తెలిపారు.

ఈ రాత్రి హైదరాబాద్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్ వీలర్స్ సంఘం వెల్లడించింది.

Tags
Chat