నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. బకాయిలు చెల్లించనందున హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
2017లో ఈ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సతీమణి రజితారెడ్డి టేకోవర్ చేసుకొని.. షాపింగ్ మాల్‌కు జీవన్‌రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్‌గా పేరుపెట్టారు. థర్డ్ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. నిరుడు అక్టోబర్ వరకు సంస్థకు రూ.8.65 కోట్ల బకాయి పడింది. నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్‌లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించింది.
ఆ తర్వాత షోకాజ్ నోటీసులు పంపించడంతో నిరుడు డిసెంబర్‌లో విడతల వారీగా రూ.2.40 కోట్లను చెల్లించింది. షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. టీఎస్‌ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతలవారీగా రెండు కోట్లను చెల్లించారుఉ. ఇంకా రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిలన్నీ నెలరోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంస్థను ఆదేశించింది. నెలరోజుల గడువు పూర్తయినా మొత్తం బకాయిలను ఆ కంపెనీ చెల్లించలేదు. హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చిన ఆర్టీసీ భవనాన్ని స్వాధీనం చేసుకున్నది.
