చైర్‌పర్సన్ మార్పునకు ససేమీరా
మునిసిపల్ పాలక వర్గాన్ని మార్చాలని ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన ఎత్తుగడలు బెడిసికొట్టాయి.
ఎన్నికల్లో మోసం చేసి పదవుల కోసం ముందుకొస్తారా అంటూ మాజీ ఎమ్మెల్యే సూటీ ప్రశ్నలు
- ముఖం చెల్లక వెనుదిరిగిన నాయకులు
నాగర్‌కర్నూల్ : మునిసిపల్ పాలక వర్గాన్ని మార్చాలని ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన ఎత్తుగడలు బెడిసికొట్టాయి. ఇందుకు మాజీ ఎమ్మెల్యే తీవ్ర విముఖత వ్యక్తం చేయడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముఖం చెల్లక వెనుదిరిగారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మునిసిపల్ పాలకవర్గం కాల పరిమితి మరో ఏడాదిలోపల మిగిలి ఉన్న నేపథ్యంలో చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వచ్చిన ప్రతిపాదనలు బీఆర్‌ఎస్ నుంచి చాలా మంది సభ్యులు కాంగ్రెస్‌లో చేరుతామని చేసిన అభ్యర్థనలను ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పరిగణనలోకి తీసుకోలేదు. స్వల్ప వ్యవధిలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజా క్షేత్రంలో బలం తేల్చుకున్నాకే నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాగా, జనరల్ లేడీకి కేటాయించిన నాగర్‌కర్నూల్ మునిసిపల్ చైర్‌పర్సన్ పదవి బీసీ సామాజిక వర్గానికి చెందిన కల్పనకు వరించింది. దాదాపు నాలుగేండ్లుగా ఆమె ఆ పదవిలో కొనసాగుతున్నారు. భర్త భాస్కర్‌గౌడ్ మర్రి జనార్దన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మర్రి జనార్దన్‌రెడ్డి ఓడిపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కల్పనపై అవిశ్వాసం పెట్టనున్నారని వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు టచ్‌లోకి వెళ్లారు. మీరు ఎవరినీ ప్రతిపాదించినా మేము మద్దతిస్తామని పేర్కొనప్పటికీ దామోదర్‌రెడ్డి అందుకు అంగీకరించలేదు. మెజార్టీ సభ్యులున్న బీఆర్‌ఎస్ చైర్‌పర్సన్‌ను దొడ్డిదారిన దించి అప్రతిష్టను మూటగట్టుకోవాలనే తలంపు లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త ప్రతిపాదనతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వద్ద ప్రత్యక్షమయ్యారు. చైర్‌పర్సన్ పదవిని అరెకటిక సామాజిక వర్గానికి చెందిన ఒకరికి వైస్ చైర్మన్ పదవిని కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అప్పజెప్పాలని ప్రతిపాదనలు మోసుకెళ్లగా, మర్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. పట్టణంలో కొందరు కౌన్సిలర్ల వ్యవహారం మూలంగానే తాను ఓటమి చెందానని ఆ వ్యవహారం నుంచి కోలుకోకముందే మీకు పదవులపై మోజు పుట్టిందా అని సూటిగా ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ వైరు పక్షానికి సమాచారం, సహకారం అందించిన అందరి వివరాలు తన వద్ద ఉన్నాయని మీకు అవసరమైతే చెప్పండి ఆధారాలతో సహా ఇప్పుడే చూపిస్తానంటూ బహిరంగంగా చెప్పడంతో ఎదురు మాట్లాడే ధైర్యం లేక కొందరు కౌన్సిలర్లు వెనక్కి తిరిగొచ్చారు.
అవిశ్వాసానికి ఎందరు కావాలంటే...
ప్రస్తుత చైర్‌పర్సన్ కల్పనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 18మంది నోటీసు ఇవ్వాల్సి ఉంది. ఇందులో మెజార్టీ సభ్యులు బీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఏడుగురు సభ్యులున్నప్పటికీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టి తక్షణం ఆమెను దించే యోచన లేకపోవడంతో మెజార్టీ కౌన్సిలర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినందున ఎమ్మెల్సీగా కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నందున వారి మాటే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రస్తుత చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో లేదు.