Guvvala Balaraju: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల రాజీనామా.. 10న ఆ పార్టీలోకి..?
బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్‌కు పంపించారు. ఈ లేఖలో కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం గువ్వల నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. త్వరలోనే ఆ జాతీయ పార్టీలో చేరుతారని సమాచారం.
బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్‌కు పంపించారు. ఈ లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజీనామా నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నది కాదని.. ఎంతో ఆలోచించి, ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత బాధతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపిన గువ్వల.. కష్ట సమయంలో పార్టీని వీడడం బాధగా ఉందన్నారు. అయినా భవిష్యత్తు కోసం తప్పడం లేదని లేఖలో తెలిపారు.
కాగా గువ్వల బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గువ్వలతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈ నెల 10న కమలం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా 2009లో నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన గువ్వల మంద జగన్నాథం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అచ్చంపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణపై భారీ మెజార్టీతో గెలించారు. 2018లోనూ మరోసారి విజయకేతనం ఎగురవేశారు. 2022లో నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయింగా.. ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం చెప్పింది. అంతేకాకుండా పలువురు కీలక నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇప్పుడు గువ్వల బాలరాజు సైతం ఆ లిస్ట్‌లో చేరారు. అయితే ఎవరు పోయిన పార్టీకి వచ్చిన నష్టం ఏమిలేదని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా గువ్వల రాజీనామాపై ఎలా స్పందిస్తారో చూడాలి.